బోండా ఉమ, బుద్ధాపై దాడి.. కార్లు ధ్వంసం.. అసలేమైంది!?

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారు మాచర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందో ఏమోగానీ.. వారు ప్రయాణిస్తున్న కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ నేతలు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కాపు కాసి.. దాడిచేశారని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందనే వార్తలతో... వాకబు చేసేందుకు నేతలు మాచర్లకు వెళ్లారు. కొందరైతే ఏకంగా కర్రలతో అద్దాలను పగలకొట్టారు. డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లడంతో ముప్పుతప్పింది. అయితే కారు వేగంగా వెళ్తుండటంతో కొందరైతే వెంటాడి మరీ దాడికి దిగే యత్నం చేశారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ప్రతీకారమేనా..!?

మొత్తానికి చూస్తే నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి చేసిన దానికి ప్రతీకారంగా.. ఇప్పుడు టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. నాడు పిన్నెల్లిపై కారుపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పిన్నెల్లి అనుచరులు మాత్రం ప్రతీకారేచ్ఛగా రగిలిపోతున్నారు. దీంతో ఇవాళ అవకాశం వచ్చిందని ఇలా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.

ఇదీ అసలు కారణం..

ఈ ఘటనపై పిన్నెల్లి స్పందించారు. ‘టీడీపీ నేతలు వచ్చిన వాహనాల్లో ఒక వాహనం ఓ బాలుడికి తగిలింది. దీంతో, స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే 10 కార్లలో వచ్చి గొడవకు దిగారు. ఇదే పల్నాడు ప్రాంతంలో 2014లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి చేశారు. మొన్న రైతుల ముసుగులో అమరావతిలో నాపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ ఇంత చేస్తున్నా మేం సంయమనంతో వ్యవహరిస్తున్నాం’ అని పిన్నెల్లి చెప్పుకొచ్చారు.

బతకడానికి వీల్లేదా..!?

ఈ దాడి ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీల్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?. మా నేతల కారును వెంబడించి దాడి చేశారు. కశ్మీర్‌, బిహార్‌లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా?. వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.