Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క సోదరుడిపై దాడి

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష్ సోదరుడిపై దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో కూడా పొడవాలని చూశారని స్థానికులు చెబుతున్నారు. బర్రెలక్కకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె ఉలిక్కిపడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని.. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఏ పార్టీ వారు దాడి చేశారో అర్థం కావడం లేదని వాపోయింది. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదరింపులకు పాల్పడ్డారని ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. పోలీసులు భద్రత కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోతుంది. ఎన్నికల కమిషన్ ఆమెకు విజిల్ గుర్తు కేటాయించింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. నిరుద్యోగులు చందాలు వేసుకుని మరి నియోజకవర్గంలో ఆమె విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో బర్రెలక్క హాట్ టాపిక్ అయింది.