Putharekulu:400 ఏళ్ల ఘన చరిత్ర .. కోనసీమకే ప్రత్యేకం, ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు
- IndiaGlitz, [Thursday,June 15 2023]
భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం. ప్రతి ప్రాంతానికి వేరు వేరుగా ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు వుంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు వుంటాయి. అలా మన ఆంధ్రప్రదేశ్‌కే సొంతమైన వంటకాలు, రుచులు వున్నాయి. బందరు లడ్డూ, నెల్లూరు చేపల పులుసు, వేటపాలెం జీడి పప్పు పాకం, మాడుగుల హల్వ మొదలైనవి. వీటిలో ఒకటి ఆత్రేయపురం పూతరేకులు.
ఖండాలు దాటుతున్న ఆత్రేయపురం పూతరేకులు :
నోట్లో పెట్టుకగానే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు ఆత్రేయపురం పుట్టినిల్లు. ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో పూత రేకులు తయారు చేస్తారు. వీటి రుచి నేపథ్యంలో కోనసీమ, గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చే వారు ఖచ్చితంగా పూతరేకులను రుచిచూస్తారు. కాలక్రమేణా అనేక ప్రాంతాల్లో ఆత్రేయపురం పూతరేకులు దొరుకుతున్నా.. ఒరిజినల్ టేస్ట్ కావాలంటే మాత్రం అక్కడికి వెళ్లాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ, విదేశాలకు కూడా ఆత్రేయపురం పూతరేకులు కొరియర్ల ద్వారా వెళ్తుంటాయి.
జీఐ ట్యాగ్ కోసం ఇటీవలే దరఖాస్తు :
ఈ పూతరేకుల ద్వారానే ఆత్రేయపురం వరల్డ్ ఫేమస్ అయ్యింది. కోనసీమకు వెళ్తున్నామంటే ఇరుగుపొరుగువారు ఖచ్చితంగా వచ్చేటప్పుడు పూతరేకులు తీసుకురామని అడుగుతారు. పూతరేకులు తయారు చేయడం ఇక్కడి ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. ఇంతటి విశిష్టత కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి.
ఆత్రేయపురం పూతరేకులకు 400 ఏళ్ల చరిత్ర :
400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు సర్ ఆర్ధర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం , విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం సహకారంతో జీఐ (భౌగోళిక గుర్తింపు) కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై స్పందన ఇచ్చింది. ఈ నెల 13తో అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు కూడా ముగియడం.. ఆత్రేయపురం పూతరేకులపై అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం విరాలు తెలియజేసింది.