ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ టీడీపీ నూతన కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. అచ్చెన్నాయుడు కుటుంబం ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. ఎన్నో క్లిష్టమైన సందర్భాల్లోనూ ఆ కుటుంబ పార్టీని విడిచి పోయింది లేదు సరికదా.. పార్టీకి అండగా నిలిచింది. ఎర్రన్నాయుడు పార్టీ కోసం చేసిన సేవ మరువలేనిది. ఆయన మరణానంతరం కూడా అదే సపోర్టును ఆయన కుటుంబం పార్టీకి అందిస్తూ వస్తోంది.
ఇక అచ్చన్నాయుడుతో పాటు ఎంపీగా రామ్మోహన్ నాయుడు కూడా పార్టీ తరుఫున గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రామ్మోహన్ నాయుడికి ఇవ్వాలని భావించినట్టు సమాచారం. అయితే రామ్మోహన్ నాయుడి అవసరం ఇక్కడ కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉండటంతో అదనపు భారాన్ని మోపలేక.. పార్టీ అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో చర్చించిన అనంతరం అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అచ్చెన్నాయుడికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం.. ఈ నెల27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ కొత్త కమిటీలను సైతం అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే పట్టం కట్టనున్నారు. కాగా.. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు ఇటీవల జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. సుమారు 70 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments