అమ్మకు వందనం.. ఆటా ఆధ్వర్యంలో ‘మదర్స్ డే’ వేడుకలు
- IndiaGlitz, [Wednesday,May 11 2022]
వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా 17వ మహాసభలకు ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, అన్ని కమిటీల సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15000 మంది హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల మాట్లాడుతూ జూలై 1 నుండి 3 వరకు జరగనున్న ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో అన్ని కమిటీల సభ్యులు సమన్వయంతో 17వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు ఒక్కొక్క కమిటీల సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
ఇకపోతే.. ఆదివారం మదర్స్ డేని పురస్కరించుకొని కాన్ఫరెన్స్ కల్చరల్ ఛైర్ దీపికా బుజాల, కాన్ఫరెన్స్ కల్చరల్ అడ్వైజరీ సాయికాంత్ రాపర్ల, సుధా రాణి కొండపు, మహిళా స్పోర్ట్స్ కో-ఛైర్ ప్రశాంతి ముత్యాల తదితరులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అలాగే శాండియాగోలో వున్న ఆటా మహిళలు కూడా కేక్ కట్ చేసి మదర్స్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకొన్నారు.
ఇకపోతే.. ఆటా 17వ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్, Daaji కమలేష్ పటేల్ , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు, హీరోలు విజయ్ దేవరకొండ , DJ Tillu సిద్దు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, 1983 ప్రపంచకప్ జట్టు సభ్యులు కపిల్ దేవ్, గవాస్కర్, గాయకుడు రాం మిరియాల, నేపథ్య గాయనీ మంగ్లీ, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ హాజరుకానున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజాతో సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.