‘ఆటా’ 17వ మహాసభలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం
- IndiaGlitz, [Tuesday,May 03 2022]
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే 17వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు హాజరు కావాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు మంగళవారం కవితను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది మహాసభలో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ఈ సారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో మన ఊరు -మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం, వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వారు ఎమ్మెల్సీ కవితకు వివరించారు. భవిష్యత్ తరాలకు మన బతుకమ్మ విశిష్టత గురించి తెలిపేందుకు బతుకమ్మపై ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితను కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు ఉన్నారు.
ఈ సభలకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులను ఆటా ప్రతినిధులు ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే... ఆటా మహాసభలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను ఏర్పాటు చేశామని ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల మీడియాకు తెలిపారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , రకుల్ ప్రీత్ సింగ్ , గాయకుడు రాం మిరియాల ఆటా సభలకు హాజరుకానున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరికి ఏర్పాట్లు చేస్తున్నారు.