Aswathama Review
హీరోగా ప్రేక్షకుల దగ్గర ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఓ బేబీ ఇలా పలు చిత్రాలతో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో నాగశౌర్య. ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా, హీరోగా ఛలోతో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నిర్మాతగా నర్తనశాలతో పరాజయం చవిచూశాడు. అయితే ఈసారి మరో కొత్త దర్శకుడితో హీరోగా, నిర్మాతగా సినిమా చేయడమే కాదు.. కాంటెంపరరీ సబ్జెక్ట్ మీద కథను తయారు చేసుకుని రచయితగా కూడా మారి చేసిన సినిమాయే `అశ్వథ్థామ`. మరి ఈ చిత్రం నాగశౌర్యకు ఎలాంటి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది? అశ్వథ్థామగా నాగశౌర్య నటన ఆకట్టుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
గణా(నాగశౌర్య)కి చెల్లెలు ప్రియా అంటే ప్రాణం. ఆమె పెళ్లి కోసం అమెరికా నుండి ఇండియా వస్తాడు. గర్ల్‌ఫ్రెండ్ నేహా(మెహ్రీన్)తో పెళ్లి కూడా కుదురుతుంది. అంతా హ్యాపీ అని అనుకుంటున్న తరుణంలో ప్రియా ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటే గణా ఆమెను కాపాడుతాడు. ప్రియాకు తెలియకుండానే.. ఆమె గర్భవతి అయ్యిందని తెలిసి షాక్ అవుతాడు. అబార్షన్ చేయించి పెళ్లి జరిపిస్తాడు. అసలు చెల్లెలు విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి గణా ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో సిటీలో మరికొంత మంది అమ్మాయిలు కనపడకుండా పోవడం మళ్లీ కనపడటం.. వారు గర్భవతులు మారుతున్నారనే నిజం తెలుస్తుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం.. మరో అమ్మాయిని ఎవరో హత్య చేయడం జరుగుతుంది. దాంతో గణా సీరియస్‌గా ముందుకెళ్లే క్రమంలో ఓ నలుగురు అంబులెన్స్‌లో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారని వారి వెనుక ఎవరో ఉన్నారనే నిజం తెలుస్తుంది. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురితో కిడ్నాప్‌లు చేయిస్తుందెవరు? అనే నిజం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
నాగశౌర్య ఇప్పటి వరకు లవర్‌బోయ్ పాత్రల్లోనే ఎక్కువగా నటించాడు. తొలిసారి యాక్షన్ హీరోగా మారే క్రమంలో నాగశౌర్య చేసిన ప్రయత్నమే అశ్వథ్థామ. ఈ సినిమా కోసం పూర్తిగా లుక్ విషయంలో కేర్ తీసుకున్నాడు శౌర్య. ఫిజిక్ పెంచాడు. ప్రేక్షకులు చూడగానే సాలిడ్‌గా ఉన్నాడనేలా మారాడు. ఒక పక్క అన్నయ్యగా.. మరో పక్క ఏదో జరుగుతుంది దాన్ని తెలుసుకోవాలనే యువకుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ విషయంలో ఫైట్స్ విషయంలో తను పడ్డ కష్టం కనపడుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే అంబులెన్స్ సీన్.. ఫైట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే అసలు ఏదో సీక్రెట్ ఉందనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు దాచేలా కథను రన్ చేయడం కూడా బావుంది. ఓ సైకిక్ విలన్ అమ్మాయిలను చెరపడుతుంటే.. ద్రాపది అన్యాయాన్ని ప్రశ్నించిన అశ్వథ్థాముడిలా నాగశౌర్య వేసే అడుగులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. మెహ్రీన్ పాత్ర పరిమితం. పాటలకు పరిమితమైంది. ఆమె పాత్రలో నటనకు పెద్దగా స్కోప్ లేదు. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అన్నారు కానీ.. అది ఎక్కడా పెద్దగా ఎమోషనల్‌గా వర్కవుట్ కాలేదు. జయప్రకాశ్, హీరో చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి తదితరులు వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. విలన్ జిస్సు సేన్ గుప్తా నటన బావుంది. సైకిక్ విలన్‌గా తను బాగా నటించాడు. ఇక సాంకేతికంగా చూస్తే శ్రీచరణ్ సంగీతంలోని పాటలు ఓకే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం బావుంది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. కాంటెంపరరీ సబ్జెక్ట్ మీద నాగశౌర్య రాసుకున్న కథ బావుంది. డార్క్ పాయింట్‌లో తెరకెక్కించిన థ్రిల్లర్.
చివరగా.. 'అశ్వథ్థామ'.. ఆకట్టుకునే డార్క్ థ్రిల్లర్
Read Aswathama Movie Review in English
- Read in English