దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది: అశ్వనీదత్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతారామం' చిత్ర విశేషాలివి.
సీతారామం మీ బ్యానర్ లో మరో 'మహానటి' అవుతుందని భావిస్తున్నారా ?
చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది.
ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గడానికి కారణం ఏమని భావిస్తున్నారు ?
కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి.
ప్రొడక్షన్ అంతా మీ పిల్లలకి అప్పగించినట్లేనా ? నిర్మాణంలో వారికి స్వేఛ్చ ఇచ్చినట్లేనా?
ఎన్టీఆర్ గారు, రాఘవేంద్రరావు, చిరంజీవి గారితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం వుండేది. ఇద్దరు పిల్లలు చదువు పూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా వుంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.
సీతారామంలో పాటలు అద్భుతంగా రావాడానికి కారణం సంగీతం పట్ల మీకున్న అభిరుచేనా?
నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్ ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. ''మీరు ఎదురుగా వుంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ''అని మహదేవన్ గారు అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా గారు కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం వుంది. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు.
హను రాఘవపూడితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టువుంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా వుంటాయి.
తెలుగులో ఇంతమంది హీరోలు వుండగా దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ?
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'' అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ వుండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు.
సీతారామంలో నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఉందా ?
నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. అయితే కొన్ని సూచనలు ఇస్తుంటారు. తను సీతారామం చూసి అద్భుతంగా వుందని చెప్పారు.
సుమంత్ పాత్ర గురించి ?
సుమంత్ పాత్ర అద్భుతంగా వుంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది.
సీతారామంలో ఎన్ని పాటలు వున్నాయి ?
ఆరు పాటలు వున్నాయి. ఒకటి అర చిన్న బిట్ సాంగ్స్ నేపధ్యంలో వినిపిస్తాయి. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు వుంటుంది. సినిమా ఫాస్ట్ గా వుంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలౌతుంది.
కొత్త గా చేయబోతున్న సినిమాలు
ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వుంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో వున్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలౌతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com