Astrologers:శ్రీరాముడి నక్షత్రంలో జననం .. తాత, తండ్రుల్ని మించిన వైభవం , చరణ్ కుమార్తె జాతకంపై జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రాకతో మెగా ఫ్యామిలీ, సన్నిహితులు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సంబరాలు అంబరాన్ని తాకాయి. మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు స్వాగతమంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు.. బిడ్డ పుట్టిన ఘడియలు బాగున్నాయని.. ఆమె వల్లే తమ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. మరి పాప జాతకం ఎలా వుంది, ఆమె భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకోనుంది..? తదితర వివరాలను ‘‘ https://indiaglitz.com/ ’’ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.
చిరంజీవికి ఆంజనేయ స్వామి, శ్రీరాముడు ఇష్ట దైవాలన్న సంగతి తెలిసిందే. శ్రీరామచంద్రుడిపై వున్న భక్తితోనే తన కుమారుడికి రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు చరణ్ కుమార్తె కూడా శ్రీరాముడి అనుగ్రహంతో ఆయన జన్మనక్షత్రమైన ‘‘పునర్వసు’’లో జన్మించడం యాదృచ్ఛికం. శ్రీరాముడు రూపంలో గానీ , గుణంలో గానీ గొప్పవారన్న సంగతి తెలిసిందే. రాం చరణ్ కుమార్తె జాతకం విషయానికి వస్తే.. ఆమె జన్మలగ్నం మేష లగ్నం, పుట్టిన నక్షత్రం పునర్వసు మొదటి పాదం, మిథున రాశి.
గురువు, రాహువులు లగ్నంలో సంచరిస్తున్న సమయంలో పాప పుట్టడం వల్ల గురు చండాల యోగమే అయినప్పటికీ.. విశేషమైన రాజభోగాలు పొందుతుంది. దీని ఫలితంగా ధన , కనక, వస్తు, వాహనాలతో తులతూగుతుందని పండితులు చెబుతున్నారు. పాప జాతక ప్రభావంతో రామ్ చరణ్ - ఉపాసనలకు ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయట. చిన్నారి పుట్టిన వేళా విశేషం కారణంగా రామ్ చరణ్ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెబుతున్నారు. మేష లగ్నానికి భాగ్య , వ్యయాధిపతి అయిన గురువు లగ్నంలో సంచరించడం వల్ల విశేషమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రాహువు లగ్నంలో వుండటం వల్ల చేసే పనిలో కార్యదీక్ష, పట్టుదల , అనుకున్నది సాధించే తత్వం జాతకురాలిలో వుంటుందట. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పాప కూడా స్వతంత్రురాలిగా ఎదుగుతుందని పండితులు అంటున్నారు. తండ్రి రాం చరణ్ సాధించిన దానికంటే పదింతలు ఎక్కువ సంపద, పేరు ప్రతిష్టలను పాప సాధిస్తుందట.
తృతీయ స్థానంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. పంచమాధిపతి అయిన రవి తృతీయంలో సంచరించడం వల్ల ఈ పాపకు తోడపుట్టిన వాళ్లు కూడా వుంటారని పండితులు అంటున్నారు. రామ్ చరణ్ వంశంలో వంశోద్ధారకుడు ఖచ్చితంగా జన్మిస్తాడని చెప్పారు. పాపకు నలుపు రంగు బాగా కలిసి వస్తుందని.. నలుపు రంగు వస్తువులు వాడటం వల్ల ఆ కుటుంబంలో అభివృద్ధి త్వరగా జరుగుతుందట. ఆలయ నిర్మాణం కూడా ఈ చిన్నారి చేతుల మీదుగా జరిగే అవకాశం వుందని.. అత్తగారింట్లో వైభోగాలు పొందుతారని శాస్త్రరీత్యా చెబుతున్నారు. తాత, తండ్రి మాదిరిగా ఈ చిన్నారి కళారంగాల్లో అద్భుతంగా రాణిస్తుందని పండితులు అంటున్నారు. లాభస్థానంలో శని సంచారం వల్ల విశేషమైన కీర్తి ప్రతిష్టలు , చిన్న వయసులోనే ప్రముఖులతో పరిచయాలు, స్నేహితులు చాలా తక్కువ, కానీ తనను కావాలనుకునేవాళ్లు మాత్రం ఎక్కువగా వుండటం జరుగుతుందని వారు చెబుతున్నారు. శ్రీరాముడిలాగా ఈ పాప చిన్నారి గొప్ప స్థాయికి చేరుకుంటుందని జ్యోతిష్యులు అంటున్నారు.
ఈ ఏడాది జూన్ 30 నుంచి ఆగస్ట్ 16 లోపు ఈ పాప జాతకాన్ని బట్టి తండ్రి రామ్ చరణ్‌కు యోగ్యమైన దశ వస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట. 2036 వరకు గురు మహర్దశ వుంటుందని, పాప జాతకంలో గురువు రాజయోగ స్థానంలో వున్నందున ఈ 13 ఏళ్ల కాలంలో సంపద, ఉన్నత విద్య పొందుతుందని జ్యోతిష్యులు తెలిపారు. తర్వాత వచ్చే 19 సంవత్సరాల శని మహర్దశలో విశేష పేరు ప్రతిష్టలు, విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయన్నారు.
ఇక సంఖ్యా శాస్త్రం ప్రకారం.. రాం చరణ్ కుమార్తె జాతకాన్ని పరిశీలిస్తే.. 20.6.2023న పాప జన్మించింది. ఆమెకు 2 లక్కీ నెంబర్ .. డెస్టినీ నెంబర్ 6 ( 2+6+2+0+2+3 = 15, 1+5=6) . 2వ నెంబర్‌కు చంద్రుడు అధిపతి కావడం వల్ల తెల్లని బట్టలు ధరిస్తే ఈ పాపకు అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. మొత్తం మీద రాంచరణ్ కుమార్తె దైవానుగ్రహాంతో, శ్రీరాముడి ఆశీస్సులతో జన్మించిందని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments