ఈటెల రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. తొలి ఎమ్మెల్యే ఆయనే!
- IndiaGlitz, [Saturday,June 12 2021]
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాజీనామా పత్రాన్ని ఆయన స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు. తాజాగా స్పీకర్ ఈటెల రాజీనామాని ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం గెజిట్ విడుదల చేసింది.
దీనితో హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం అందించింది. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా, కేసీఆర్ సన్నిహితుడిగా పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన కేసీఆర్ నే ఢీకొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈటెల రాజేందర్ 2004లో తొలిసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 నుంచి ఇప్పటి వరకు హుజురాబాద్ నియాజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008, 2010 సంవత్సరాలలో ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజా రాజీనామాతో ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే పదవికి రిసైన్ చేసినట్లు అయింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజీనామా చేసిన తొలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. హుజురాబాద్ ఖాళీ అయినా నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఉపఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ నెల 14న ఈటెల బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. బిజెపి మద్దతుతో ఈటెల కేసీఆర్ ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తిగా మారింది.