అను ఇమ్మాన్యుయేల్‌కు అంకుల్‌గా..

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

1998లో విడుద‌లైన‌ 'గ్రీకువీరుడు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు త‌న‌యుడు దాసరి అరుణ్ కుమార్. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోయింది. అంతేగాకుండా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అరుణ్‌కు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.

2008లో విడుద‌లైన‌ 'ఆదివిష్ణు' త‌రువాత‌ సినిమాలకు దూరమయ్యారు అరుణ్ కుమార్‌. ఇటీవల 'ఒక్కక్షణం'తో మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌.. ప్రస్తుతం నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'(ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌)లో నటిస్తున్నారు.

దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ అనుకి అంకుల్ పాత్రలో అరుణ్ కుమార్ కనిపిస్తున్నారని తెలిసింది. అంతేగాకుండా.. అరుణ్ కోసం ప్రత్యేకంగా ఈ పాత్రని డిజైన్ చేశారని స‌మాచారం. ఈ పాత్ర తర్వాత వరుస ఆఫర్లతో అరుణ్ కుమార్ బిజీ నటుడిగా మారడం ఖాయమని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శైల‌జా రెడ్డిగా రమ్యకృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.