సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు.. ఆర్య రాజేంద్రన్..
Send us your feedback to audioarticles@vaarta.com
21 ఏళ్ల వయసు.. ఇంజినీరింగ్ చదువుతోంది. ఎవరైనా ఏం అనుకుంటారు? ఇంజినీరింగ్ పూర్తైతే ఐదంకెల్లో జీతం.. అద్భుతమైన జీవితం.. కావాలంటే ఇండియా.. లేదంటే ఏ ఫారిన్కో ఎగిరిపోవచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆలోచనంతా ఇలాగే ఉంటుంది. దీనికి భిన్నంగా అయితే ఉండదు. కానీ ఒక యువతి మాత్రం ఇంజినీరింగ్ చదువుతూనే రాజకీయాల వైపు అడుగులు వేసింది. మేయర్‌గా ఎన్నికై.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్‌గా చరిత్రకెక్కింది. ఇక ఆమెను మేయర్‌గా ప్రకటించగానే సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఆమె ఫోటోను ట్యాగ్ చేస్తూ 21 ఏళ్ల అతి పిన్న వయస్కురాలైన మేయర్‌గా ట్రెండ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన కేరళ స్థానిక ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్.. ఆరు మునిసిపల్ కార్పోరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో భాగంగా కేరళ రాజధాని తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌ను సీపీఎం గెలుచుకుంది. కేరళలోనే అతి పెద్ద మునిసిపాలిటీ తిరువనంతపురమే. ఇక్కడ ఉన్న 100 వార్డులకు గాను.. 51 స్థానాలను వామపక్ష కూటమిని గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఎన్నికల్లో ఆర్య రాజేంద్రన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ముదవాన్ముగల్ వార్డు కౌన్సిలర్‌గా సీపీఎం తరుఫున పోటీ చేసి ఎన్నికైంది. ప్రస్తుతం ఆర్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. దీనికి కారణం.. ఆర్యను తిరువనంతపురం మేయర్‌గా సీపీఎం జిల్లా సచివాలయ ప్యానల్ ఎన్నుకుంది. దీంతో దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్‌గా ఆర్య రికార్డులకెక్కింది.
నిజానికి ముందు తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా మొదట పేరూర్కాడ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీధరన్‌ను ప్రకటించారు. అయితే యువతకే ప్రాధాన్యమివ్వాలనే డిమాండ్ రావడంతో సీపీఎం ఆర్యను మేయర్‌గా ప్రకటించింది. ఆర్య తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె సీపీఎం బాలల విభాగం అధ్యక్షురాలిగా ఉంది. అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా కొనసాగుతోంది. మేయర్‌గా ఎన్నికవడం పట్ల ఆర్య స్పందిస్తూ.. తనకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని.. చదువుతోపాటే రాజకీయాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments