నాకు మంత్రి పదవి వద్దు.. మోదీకి జైట్లీ లేఖ
- IndiaGlitz, [Wednesday,May 29 2019]
భారతీయ జనతాపార్టీ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగరేసి.. ఎవరి సహాయ సాకారాలు లేకుండా సింగిల్గానే ఊహించని మెజార్టీ దక్కించుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘన విజయానికి కర్త, కర్మ, క్రియ అయిన నరేంద్ర మోదీ మే-30 సాయంత్రం రెండోసారి ప్రధానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో ఎంపీలందరూ సార్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ మంత్రి పదవి కోసం అటు పీఎంవో చుట్టూ.. ఇటు అమిత్ షా ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. సమయం వచ్చినప్పుడు చూద్దామని తిన్నగా.. వారిని నొప్పించకుండానే షా చెప్పి పంపుతున్నారు.
నాకు పదవి వద్దు!
అయితే మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం తనకు మంత్రి పదవి వద్దు మహా ప్రభో..! అని ప్రధానిని వేడుకుంటున్నారు. ఇందుకు కారణం తన ఆరోగ్య సమస్యలేనని ఓ లేఖలో వివరించారు. నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని ప్రధానికి నిశితంగా తెలిపారు. ఆరోగ్యం, చికిత్సపై దృష్టి పెట్టడం కోసం నూతన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండలేను. నా కోసం, నా ఆరోగ్యం, చికిత్స కోసం కొంత సమయం ఇవ్వాలి. నేను మిమ్మల్ని(మోదీని) కోరుతున్నాను. అందువల్ల నూతన ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించలేను.. పదవీ బాధ్యతలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని అరుణ్ జైట్లీ లేఖలో స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జైట్లీ పై విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. అయితే ఈసారి ఆర్థిక శాఖ అమిత్ షాకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.