బాలుపై వచ్చిన ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది..
- IndiaGlitz, [Friday,September 25 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో బాలు పాడిన పాటకు విశేషమైన స్పందన వచ్చింది. ఆ పాట పాడిన యువకుడు ఎవరా? అంటూ విపరీతంగా చర్చ జరిగింది. అయితే నాడు ఓ వార్త పత్రిక ఆ పాట పాడిన యువకుడు అంటే మన గాన గంధర్వుడి గురించి ఏకంగా మూడు కాలమ్‌ల వార్త కథనాన్ని ప్రచురించింది. నాడు పత్రికల్లో ప్రచురితమైన ఓ కథనం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
నాటకు పాటకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మర్యాద రామన్న’ చిత్రంలో పాట పాడినప్పుడు బాలు వయసు 22 ఏళ్లని సదరు పత్రిక పేర్కొంది. చదువుకుంటున్నాడని.. ఆయనను చూసినవారెవ్వరూ ఆ అబ్బాయే పాట పాడాటంటే ఎవరూ నమ్మరని సదరు పత్రి వెల్లడించింది. ‘ఎందుకంటే ఇంత ఘనమైన కూత కూసిన పిట్ట, ఇంత కొంచెం ఉండటం ఏమిటని అనుకుంటారు’ అని పత్రికలో పేర్కొన్నారు. 1963లో జరిగిన ఓ పాటలో పోటీలో బాలుకు ప్రథమ బహుమతి లభించిందని పత్రిక పేర్కొంది.
బాలు పాడిన పాటను ప్రేక్షకుల్లో కూర్చొని విన్న సంగీత దర్శకుడు కోదండపాణికి బాలు గొంతుక బాగా నచ్చిందట. వెంటనే బాలుని పిలిచి.. ‘‘నీ పాట పాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. నీ చేత నేను చిత్రాల్లో పాడిస్తాను. అయితే నీ గొంతు మరీ లేతగా ఉంది’’ అని చెప్పి అభినందించారని పత్రికలో పేర్కొన్నారు. ఇంకా బాలు గురించి పలు ఆసక్తికర విషయాలను సదరు పత్రిక వెల్లడించింది.