వైఎస్ షర్మిళ కేసులో అరెస్ట్‌ల పర్వం ప్రారంభం..
- IndiaGlitz, [Sunday,February 03 2019]
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తనకుటుంబంపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఇప్పటికే 12 వెబ్సైట్లను గుర్తించి నోటీసులు పంపిన పోలీసులు తాజాగా వెంకటేశ్ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లా చోడవరం అని పోలీసులు గుర్తించారు. వెంకటేశ్ అనే యువకుడు గుంటూరులో ఉంటూ ఎంసీఏ చేస్తున్నాడు. సోషల్ మీడియా గురించి పట్టున్న ఇతడు టాలీవుడ్ హీరో ప్రభాస్.. వైఎస్ షర్మిళ మధ్య సంబంధం ఉందంటూ ఫొటోలు, వీడియోలు చేసి యూట్యూబ్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేశాడని ఖాకీలు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఇతనిపై సెక్షన్ 507, ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ఇలా..!
కాగా ఈ వెంకటేశ్ అనే యువకుడ్ని ఓ ప్రత్యేక బృందం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు నీ వెనుక ఎవరున్నారు..? ఏ పార్టీ వాళ్లు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారు..? ఈ వ్యవహారం మొత్తానికి కర్త, కర్మ, క్రియ ఎవరు..? నీతో పాటు ఉన్న టీమ్ ఎవరు..? ఎక్కడెక్కడ్నుంచి సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారు..? వైసీపీని దెబ్బతీయడానికి ఇలా దుష్రచారం చేయాలని మీకు సలహాలు ఇచ్చిందెవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ఒక్కడు దొరికాడు గనుక మిగతా టీమ్ మొత్తాన్ని పట్టుకోవడానికి పెద్దగా సమయం ఏమీ పట్టదని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వెబ్సైట్ల యాజమాన్యం నుంచి ఎలాంటి వివరణ వచ్చింది..? ఏమని వివరణ ఇచ్చారు..? అనే విషయం తెలియాల్సి ఉంది.