Siddham: నాలుగో 'సిద్ధం' సభకు భారీ ఏర్పాట్లు.. 15లక్షల మంది వస్తారని అంచనా..

  • IndiaGlitz, [Saturday,March 09 2024]

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు క్యాడర్‌కు దిశానిర్దేశం చేసింది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు సిద్ధం సభలను నిర్వహించింది. ఈ మూడు సభలు ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.

ఇప్పుడు చివరి సిద్ధం సభను నిర్వహించేందుకు రెడీ అయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు సభలను మించి నాలుగో సభను నిర్వహించాలనే దిశగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎంత మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేలా సభా ప్రాంగణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభా స్థలంలో సీఎం జగన్ ప్రసంగం ప్రతి ఒక్కరికీ కనిపించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక జగన్‌ కార్యకర్తలకు చేరువగా వెళ్లి మాట్లాడి వచ్చేందుకు వీలుగా భారీ ర్యాంప్‌ను కూడా సిద్ధం చేశారు. సభ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు, నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సిద్ధం సభను 200 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. అవసరం అయితే మరో 200 ఎకరాలను సిద్ధం చేస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు నిర్వహించే ఆఖరి సభ కావడంతో సుమారు 15 లక్షల మందికి సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వాహనాలు కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. అలాగే సభ నేపథ్యంలో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఇక ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రసంగంతో పాటు ఎన్నికలకు సంబంధించిన హామీలను ప్రకటించే అవకాశముంది.

ముఖ్యంగా రైతు రుణమాఫీ, పింఛన్లు పెంపు, విద్యార్థినులకు స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి హామీలు మేనిఫెస్టోలో రూపొందించినంటూ తెలుస్తోంది. మొత్తం హామీలు కాకపోయినా కొన్ని కీలక హామీలు అయితే సీఎం జగన్‌ సభా వేదికగా ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మేనిఫెస్టో విడుదల చేస్తారా..? లేక కొన్ని కీలకమైన హామీలను ఇస్తారా..? అనేది వేచి చూడాలి. ఈ సభ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించి ఎన్నికల కురుక్షేత్రంలో దిగనున్నారు.