CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.25 లక్షలకు పెంచే కార్యక్రమానికి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, సంబంధిత శాఖ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదనే ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు.
కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు..
నేటి నుంచి కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుందని.. ఈ కార్డులో లబ్దిదారుడి ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూ ఆర్ కోడ్‌తో రూపొందించినట్లు సీఎం చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలోని 2,513 ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులను కూడా ఎంప్యానెల్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని... పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
ఏటా రూ.4,100 కోట్లకు పైగా ఖర్చు..
పేదవాడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి అందించడంతో పాటు చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలోనూ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. విశ్రాంతి కాలానికి ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ. 5వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. ఇక గత ప్రభుత్వం క్యాన్సర్ వంటి భయానక రోగాల బారినపడిన పేదవారికి రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4100 కోట్లకు పైగా ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆయన వెల్లడించారు. అలాగే ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కింద ఏయే అసుపత్రుల్లో ఏయే చికిత్సలు అందుతున్నాయని తెలిసేలా యాప్‌లో వివరాలు నమోదుచేయాలని సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments