అర్నబ్ అరెస్ట్.. సోషల్ మీడియా ఫైర్..

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్‌ గోస్వామి అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున అర్ణబ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు విషయంలో రాయ్‌గఢ్, ముంబై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఏపీఐ సచిన్ వాజే నేతృత్వంలోని పోలీసుల బృందం అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు.

కాగా.. అర్ణబ్ అరెస్ట్‌పై సోషల్ మీడియా నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ముంబై సర్కార్ అర్ణబ్‌ను టార్గెట్ చేస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. #ArnabGoswami, #IndiaWithArnabGoswami, #IndiaStandaWithArnab తదితర హ్యాష్‌ట్యాగులతో నెటిజన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి తనపై శారీరకంగా దాడి చేశారని అర్నాబ్ గోస్వామి ఆరోపించారు.

అయితే అర్ణబ్‌పై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఇంటీరియమ్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కించపర్చారని, పాల్ఘార్ దాడి ఘటన, బాంద్రా స్టేషనులో జనం మోహరించిన ఘటనలపై ముంబై పోలీసు స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని, పరువునష్టం, ఉద్రిక్తతలు రేపేందుకు యత్నించారని అర్నాబ్ పై కేసులున్నాయి. మరోవైపు అర్నబ్‌కు చెందిన రిపబ్లిక్ టీవీ టీఆర్పీ రేటింగ్స్ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణను సైతం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.