‘‘శేఖర్’’లో అర్మాన్ మాలిక్‌తో మెలోడీ సాంగ్.. రెండ్రోజుల్లో రికార్డింగ్, రాజశేఖర్ బర్త్‌డేకి రిలీజ్
- IndiaGlitz, [Monday,January 31 2022]
ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా సినిమా కల్చర్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. నాలుగైదు భాషల్లో, ఆ భాషకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. అయితే పాన్ ఇండియా మూవ్‌మెంట్ మొదలవ్వడానికి ముందు నుంచే ఇతర భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వేరే భాషలకు చెందిన సినిమాల్లో భాగమవుతూ వస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందినవారైనా ఏ ఇండస్ట్రీలోనైనా పనిచేస్తూ .. తమ కళ ద్వారా ప్రజలను అలరిస్తున్నారు.
ఇందులో ప్లే బ్యాక్ సింగర్లు కూడా వున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగులో వున్న వారికి తోడు ఉత్తరాదికి చెందిన నేపథ్య గాయనీ, గాయకులు తమ సత్తా చాటుతున్నారు. ఇందులో అర్మాన్ మాలిక్ కూడా ఒకరు. అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ... 'సోలో బ్రతుకే సో బెటర్'లో నో పెళ్లి... 'వకీల్ సాబ్'లో కంటి పాప... 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో గుచ్చే గులాబీ వంటి పాటల ద్వారా అర్మాన్ మాలిక్ తెలుగు వారిని మెస్మరైజ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆయన మరో పాట పాడనున్నారు. యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా 'శేఖర్'. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో అర్మాన్ మాలిక్ చేత పాట పాడించనున్నారట. రెండు మూడు రోజుల్లో రికార్డింగ్ చేయనున్నారు. ఈ పాటను డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
శేఖర్ మూవీ రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రం. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘జోసెఫ్’’కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘‘శేఖర్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటించడం విశేషం