Arjun Suravaram Review
`కిరాక్ పార్టీ` చిత్రం అనుకున్న సక్సెస్ సాధించకపోవడంతో హీరో నిఖిల్ తన ఆశలను అర్జున్ సురవరం సినిమాపైనే పెట్టుకున్నాడు. తమిళంలో విజయవంతమైన చిత్రం `కణిదన్` ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేశారు. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సింది కానీ.. కొన్ని సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ శుక్రవారం(నవంబర్ 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిఖిల్‌కు సక్సెస్‌నిచ్చిందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
అర్జున్ లెనిల్ సురవరం(నిఖిల్) ఇంజనీరింగ్ చదువుకుంటాడు. సాఫ్ట్‌వేర్ జాబ్స్ కంటే జర్నలిజం వైపుకే తను ఆకర్షితుడవుతాడు. ఎప్పటికైనా బీబీసీలో జర్నలిస్ట్ కావాలనేది తన కల. అందుకోసం ఓ చిన్న ఛానెల్‌లో రిపోర్టర్‌గా చేరుతాడు. ఆ ఛానెల్ యజమాని కుమార్తె కావ్య(లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తను బీబీసీ ఇంటర్వ్యూలో ఎంపికవుతాడు. కథ అనుకోకుండా మలుపు తిరుగుతుంది. దొంగ సర్టిఫికేట్స్‌తో బ్యాంకును మోసం చేసి లోను తీసుకున్నాడని పోలీసులు అర్జున్‌ని అరెస్ట్ చేస్తారు. అసలు నిజంగానే అర్జున్ ఆ తప్పు చేశాడా? అర్జున్ వెనుక జరిగిన పెద్ద కుంభకోణం ఏమిటి? సమస్య నుండి అర్జున్ ఎలా బయటపడ్డాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
కథ
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
పాటలు
క్లయిమాక్స్ ఆస్తికరంగా లేకపోవడం
విశ్లేషణ:
నిఖిల్ హీరోగా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. జర్నలిస్ట్ కావాలనుకునే యువకుడిగా ఒక వైపు, కుంటుంబం కోసం తాపత్రయ పడే యువకుడిగా, తనపై పడ్డ నిందను తప్పని రుజువు చేయడానికి పరిశోధన చేసే డేరింగ్ యంగ్ జర్నలిస్ట్‌గా పలు షేడ్స్‌ను నిఖిల్ చక్కగా తెరపై ఆవిష్కరించాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. వెన్నెలకిషోర్, విద్యుల్లేఖా రామన్, సత్య వారి వారి పాత్రల మేరకు కామెడీని పండించారు. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళి చక్కగా నటించాడు. ఇక హీరో తండ్రి పాత్రలో నాగినీడు నటన బావుంది. రాజా రవీంద్ర, తరుణ్ అరోరా ప్రతి నాయకులుగా మెప్పించారు. సామ్ సి.ఎస్ సంగీతం బావుంది. సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో కెమెరా వర్క్ మెప్పిస్తుంది.
ఫస్టాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్, హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, కామెడీ సన్నివేశాలు, హీరోకి సమస్య మొదలు కావడం అనే పాయింట్‌తో ఫస్టాఫ్ రన్ అవుతుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. హీరో తన సమస్యకు పరిష్కారాన్ని వెతకం, అసలు సమస్యను కనిపెట్టి, మెయిన్ ముఠా గుట్టుని రట్టు చేయడానికి హీరో ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో సెకండాఫ్ రన్ అవుతుంది. సినిమాను మంచి పాయింట్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అయితే ఇంట్రస్టింగ్ అంశాలు, నాటకీయ అంశాలు ఎక్కువైపోయాయి. సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్, లాజిక్ లేని సన్నివేశాలుంటాయి.
బోటమ్ లైన్: అర్జున్ సురవరం.. ఆసక్తిని రేపే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథ
Read Arjun Suravaram Movie Review in English
- Read in English