Download App

Arjun Reddy Review

పెళ్లిచూపులు మూవీ స‌క్సెస్‌తో అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు ఈ త‌రం క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర కొండ‌. ఈ హీరో న‌టించిన చిత్రం అర్జున్ రెడ్డి విడుద‌ల‌కు ముందు నుండే అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకుంది. సినిమా ప్ర‌మోష‌న్స్ నుండి సినిమా విభిన్నంగానే ప్రారంభ‌మైంది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మ‌ధ్య ఉండే ముద్దు సీన్ ప‌బ్లిసిటీలో కీల‌కంగా మారింది. ఓ ర‌కంగా చెప్పాలంటే పెద్ద గొడ‌వే అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు సందీప్ సెన్సార్ బోర్డును విమ‌ర్శించారు కూడా. ప్రీ రిలీజ్ వేడుక‌లో విజ‌య్ స్టేజ్‌పై హంగామా చేశాడు. ఇన్ని ప‌రిస్థితుల మ‌ధ్య థియేట‌ర్‌లోకి వ‌చ్చిన అర్జున్‌రెడ్డి చిత్రం ప్రేక్ష‌కులు ఎలా ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

మెడిక‌ల్ స్టూడెంట్ అయిన అర్జున్ రెడ్డి(విజ‌య్ దేవ‌రకొండ‌) స్వతంత్ర్య భావాల‌ను, ఏదైనా ధైర్యంగా చేయ‌గ‌లిగే మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మ‌న‌స్త‌త్వం ఉన్న అర్జున్ ఓ సంద‌ర్భంలో త‌న ఎదుటి ఫుట్‌బాల్ టీంతో గొడ‌వ‌ప‌డి వారిని కొడ‌తాడు. కాలేజ్ యాజ‌మాన్యం ఆ గొడ‌వ‌కు క్ష‌మాప‌ణ చెబుతూ ఓ లెట‌ర్ అడుగుతుంది. కానీ తాను కాలేజ్ విడిచి వెళ్లిపోవాల‌నుకుంటాడు. ఆ సంద‌ర్భంలో ఫ‌స్ట్ ఇయ‌ర్ మెడిక‌ల్ స్టూడెంట్ ప్రీతి శెట్టి(షాలిని)ని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కాలేజ్‌లో సీనియ‌ర్ కాబ‌ట్టి షాలినికి త్వ‌ర‌గా ద‌గ్గ‌ర‌వుతాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగి తేలుతారు. ఈలోపు అర్జున్ రెడ్డి త‌న మాస్ట‌ర్స్ కోర్సును కూడా పూర్తి చేసేస్తాడు. షాలిని వాళ్లింట్లో పెళ్లి గురించి మాట్లాడుతాడు. కానీ కులం ప‌ట్టింపుతో షాలిని తండ్రి పెళ్లికి ఒప్పుకోడు. షాలినిని వేరొక‌రికిచ్చి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు అర్జున్ రెడ్డి ప‌రిస్థితేంటి? అర్జున్ రెడ్డి భ‌గ్న ప్రేమికుడిగా మారి ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు?  చివ‌ర‌కు అర్జున్ రెడ్డి పయ‌న‌మెటు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

విశ్లేష‌ణ:

పాత్రల‌ తీరు తెన్నులు:

కాలేజ్ టాప‌ర్‌, కోపాన్ని అదుపు చేసుకోలేని యువ‌కుడు, భ‌గ్న ప్రేమికుడు, త‌న ప్రేమ కోసం ఏం చేయాలో తెలియ‌క ఏవేవో చేసే పాత్ర‌ధారిగా విజ‌య్‌దేవ‌ర‌కొండ ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, న‌ట‌న ప‌రంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో మ‌రో యాంగిల్‌ను ప‌రిచ‌యం చేసిన చిత్రంగా అర్జున్‌రెడ్డిని చెప్పొచ్చు. ఫ‌స్టాఫ్‌లో త‌ర‌హా పాత్ర‌లో, సెకండాఫ్‌లో మ‌రో త‌ర‌హా క్యారక్ట‌రైజేష‌న్‌లో విజ‌య్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయం. ఇక హీరోయిన్ షాలిని లుక్స్ ప‌రంగా ఓకే. పెర్ఫామెన్స్ చాలా బావుంది. సినిమాలో స‌గ భాగం ఈ రెండు పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇక సినిమాలో చెప్పుకోద‌గ్గ మ‌రో క్యార‌క్ట‌ర్ హీరో స్నేహితుడిగా న‌టించిన రాహుల్ రామ‌కృష్ణ‌. స్నేహితుడిని కాపాడుకుంటూ, కంట్రోల్ చేస్తూ, విమ‌ర్శిస్తూ, స‌హాయ‌ప‌డుతూ క‌న‌ప‌డే శివ పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. స‌న్నివేశాల ప‌రంగా కామెడిని జ‌న‌రేట్ చ‌య‌డంలో రాహుల్ రామ‌కృష్ణ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక హీరో అన్న‌య్య పాత్ర‌లో క‌మ‌ల్ కామ‌రాజు, తండ్రి పాత్ర‌లో సంజ‌య్ స్వ‌రూప్‌, హీరోయిన్ తండ్రి పాత్ర‌లో ఆనంద్ భ‌ట్‌, లాయ‌ర్ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, అమిత్ స‌హా మిగిలిన పాత్ర ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:

ఈ విభాగంలో ద‌ర్శ‌కుడు సందీప్ వంగాకే ప్ర‌థ‌మ‌స్థానం ఇవ్వాలి. ఇద్ద‌రు ప్రేమికులు విడిపోతారు. తిరిగి ఏమ‌వుతారు? క‌లుసుకుంటారా?  లేదా? అనేదే క‌థ‌లో మెయిన్ పాయింట్‌. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ఎమోష‌న‌ల్‌గా, స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా మ‌లుచుకుంటూ వెళ్లిన తీరు, పాత్ర‌లను డిజైన్ చేసిన తీరు, పాట‌ల‌ను క‌థ‌లో భాగంగా చిత్రీక‌రించిన విధానం, అన్ని బావున్నాయి. ద‌ర్శ‌కుడికి స‌హకారం అందిస్తూ ర‌ధ‌న్ అందించిన స్వ‌రాలు చాలా చ‌క్క‌గా విన‌సొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. రాజు తోట సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రో అద‌న‌పు బ‌ల‌మైంది. సినిమాటోగ్రాఫ‌ర్ రాజు స‌న్నివేశాల‌ను ఫ్రెష్ లుక్‌తో చిత్రీక‌రించాడు. గుండెలోనా నిండుకున్న ప్రేమ‌నంతా చూపుకున్న ఈనాడు.., ఎమిటెమిటో..., మ‌ధుర‌మే ఈ క్ష‌ణం.. , అంటూ సాగే పాట‌లు బావున్నాయి. మిగిలినన్ని పాట‌లు కూడా ఆక‌ట్ట‌కుంటాయి. ముఖ్యంగా హీరోయిన్‌ను ఫ‌స్ట్ టైమ్ హీరో చూసే సంద‌ర్బంలో వ‌చ్చే సుంద‌రి అనే సాంగ్ బావుంది.

ఆకట్టుకునే పాత్ర‌లు, స‌న్నివేశాలు:

సినిమాలో పాత్ర‌ల‌న్నీ బాగానే ఉన్నా, ప్రేక్ష‌కుడి మ‌దిలో రిజిష్ట‌ర్ అయ్యే పాత్ర‌లు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ పాత్ర ఒక‌టి. ప్రారంభంలో చెప్పిన రీతిలో హీరో క్యార‌క్ట‌రైజేష‌న్‌లో విభిన్న‌మైన పార్వ్శాలు, వాటిని విజ‌య్ క్యారీ చేసిన విధానం చాలా బావుంది. ప్రేకకుడికి బాగా రిజిష్ట‌ర్ అవుతాయి. హీరో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వేరే ఫుట్‌బాల్ టీంను కొట్టి క‌ప్పును తీసుకొచ్చేసే స‌న్నివేశంతో పాటు కాలేజ్ డీన్‌తో త‌ను చేసిన ప‌నిని స‌మ‌ర్ధించుకునే స‌న్నివేశంతో హీరో ఎలాంటివాడో ఎలివేట్ చేశారు. ఇక హీరోయిన్ చూడ‌గానే కాలేజ్‌లో ఉండాల‌ని ఫిక్స్ అయిపోయే స‌న్నివేశం, స‌హా హీరోయిన్‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాలు అన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. అలాగే హీరో ఎంత బాధ‌లో ఉన్నా, కూడా త‌న డ్యూటీని మ‌ర‌చిపోడు. వృత్తికి గౌర‌మిచ్చే మ‌న‌స‌త్త్వం ఉన్న‌వాడిని తెలియ‌జేసే సీన్స్ బావున్నాయి. అలాగే హీరో, హీరోయిన్ ఇంటికి వెళ్లి వారికి స‌ర్ధి చెప్పాల‌నుకోవ‌డం, కోపం రావ‌డంతో వ‌చ్చేసే సీన్‌లో హీరోయిన్, హీరోను స‌ముదాయించే స‌న్నివేశంతో పాటు హీరోయిన్‌కు పెళ్లి కాగానే ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయి ఆమెను త‌న‌తో వ‌చ్చేయ‌మ‌ని బ్ర‌తిమాలాడ‌టం వంటి సీన్స్, ఇక యూత్‌ను ఆక‌ట్టుకునేలా కొన్ని రొమాంటిక్ సీన్స్‌, వాటిలో హీరో న‌ట‌న బావుంది. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ తీరు, తెన్ను బావుంది. హీరోను కాలేజ్‌లో తిట్టే స‌న్నివేశం, హీరో, రాహుల్ రామ‌కృష్ణ‌కు మ‌ధ్య వ‌చ్చే పిఎంఎస్ సీన్ బావుంది. అలాగే రాహుల్ రామ‌కృష్ణ‌కు, అత‌ని తండ్రి పాత్ర‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా బావున్నాయి. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి.

లోపాలు:

రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల సినిమాలు వ‌స్తున్న ఈరోజుల్లో మూడు గంట‌ల సినిమా అనేది ప్రేక్ష‌కుడిని ఆలోచ‌న‌లోకి నెడుతుంది. అలాగే ఫ‌స్టాఫ్ ఉన్నంతగా సెకండాఫ్ ఉన్న‌ట్లు అనిపించ‌దు. హీరోయిన్‌ను మ‌ర‌చిపోవ‌డానికి హీరో సెకండాఫ్‌లో చేసే ప‌నులు కాస్తా ఓవ‌ర్ చేసిన‌ట్టు అనిపిస్తాయి. ఎడిటర్ సెకండాఫ్‌లో ఓ ప‌దిహేను నిమిషాల సినిమాను ఎడిట్ చేస్తుండాల్సిందనిపించింది.

బోట‌మ్ లైన్: అర్జున్ రెడ్డి - ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ

Arjun Reddy Movie Review in English

Rating : 3.3 / 5.0