Vyuham: 'వ్యూహం' సినిమా విడుదలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్..
- IndiaGlitz, [Thursday,January 11 2024]
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సినిమా వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు నిర్మాత దాసరి కిరణ్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈ వాదనపై లోకేష్ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు అన్ని నిబంధనలను పరిశీలించాలకే సెన్సార్ సర్టిఫెకెట్ జారీ చేశామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు.
ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్సార్ మరణానంతరం, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారనిఈ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. టీఎస్ హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. ఈ లోపు సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను తమ ముందు పొందుపర్చాలని ఆదేశించింది.
తాజాగా దీనిపై విచారణ జరగగా.. వాడివేడిగా వాదనలు జరిగాయి. మూవీ ఎవరినీ కించపరిచేలా లేదని నిర్మాత తరపు న్యాయవాదులు వాదించారు. లోకేష్ తరపు న్యాయవాదులు మాత్రం చంద్రబాబును కించపరిచేలా సన్నివేశాలు తెరకెక్కించారని వాదించారు. సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రేపు వెల్లడిస్తామని తెలిపింది. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఆర్జీవీకి అనుకూలంగా తీర్పు వస్తుందా.. లేక టీడీపీకి మద్దతుగా తీర్పు వస్తుందా అనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైంది. మరి సినిమా విడుదలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో రేపటి వరకు వేచి చూడాలి.