ఈఎస్ఐ స్కాంలో ఏ1 నిందితుడి అరెస్టుపై హైకోర్టులో వాదనలు
- IndiaGlitz, [Thursday,June 18 2020]
ఈఎస్ఐ స్కాంకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో గంటన్నరపాటు వాదనలు జరిగాయి. ఈ స్కాంలో ఏ1 నిందితుడిగా పేర్కొన్న రమేష్ కుమార్ అరెస్టు అక్రమమని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరుపున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఏసీబీపై ప్రభుత్వ ఒత్తిడి ఉందని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కృష్ణయ్య కోర్టును కోరారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని కాబట్టి నిందితుడిని విడుదల చేసి.. హక్కులు హరించేలా వ్యవహరించిన ఏసీబీపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
అలాగే రిమాండ్ రిపోర్టులో ఒకలా ఉందని, ఇన్‌స్పెక్టర్ చెప్పింది మరోలా ఉందన్నారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 7:30కి విజయవాడలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంటే.. ఇన్‌స్పెక్టర్ ఉదయం 7 గంటలకు తిరుపతిలో అరెస్ట్ చేశామని తెలిపారని పిటిషనర్ పేర్కొన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం ప్రభుత్వం అనుమతిస్తేనే ఏసీబీ కేసు రిజిస్టర్ చేయాలని కానీ ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదని పిటిషన్ తరుఫు న్యాయవాది కృష్ణయ్య కోర్టుకు వివరించారు. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది.