CM Jagan:యుద్ధానికి మీరు సిద్ధమా? చంద్రబాబును చంద్రముఖితో పోల్చిన సీఎం జగన్..

  • IndiaGlitz, [Saturday,February 03 2024]

ఎల్లో వైరస్ మీద, కరోనా లాంటి దుష్టచతుష్టయం మీద యుద్ధానికి మీరు సిద్ధమా? మరో చారిత్రాత్మక విజయాన్ని అందించడానికి మీరు సిద్ధమా? అని జగన్ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన 'సిద్ధం' బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన తనను కౌరవుల నుంచి రక్షించాలని కోరారు.

ఎన్నికల్లో ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు బటన్ ఫ్యాన్ నొక్కితే గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా ఉండదన్నారు. లేదంటే చంద్రముఖి లకలక అంటూ టీ గ్లాస్ పట్టుకుని సైకిలెక్కి మన రక్తం తాగుతుందని పేర్కొన్నారు. రా కదిలిరా అంటూ దత్తపుత్రుడిని, బీజేపీలోని వదినమ్మను, వైఎస్సార్ పేరును ఛార్జిషీటులో పెట్టిన పార్టీని చంద్రబాబు పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. తోడేళ్లన్ని ఒక్కటయ్యాయని.. ఆ తోడేళ్లకు జగన్ ఒంటరివాడిగానే కనిపిస్తాడని.. కానీ తనకు ప్రజలు, దేవుడు తోడుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారని.. 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన ప్రజల కోసం ఏం చేశారు? అని నిలదీశారు. ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ప్రజల ఖాతాల్లో వేశారా?అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరు అని ఆరోపించారు. అదే మన ప్రభుత్వంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ సచివాలయాలు ఏర్పాటు చేశామని.. వాటి ద్వారా 500లకు పైగా సేవలు అందిస్తున్నామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దకే పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు.

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. లంచాలు, వివక్ష లేని పారదర్శకతతో కూడిన పాలన తీసుకువచ్చామని చెప్పారు. ఈ 57 నెలల కాలంలో 124 సార్లు బటన్ నొక్కి రెండున్నర లక్షల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు. జగనన్న కోసం ఒక్కసారి మనం బటన్ నొక్కలేమా? అని ప్రతి ఇంటికి తిరిగి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్ నిర్ణయించేవని.. రూ.3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్తులో పెరగాలన్నా మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ప్రస్తుతం అందిస్తున్న పథకాల రద్దుకు మనమే ఓటు వేసినట్లవుతుందని ప్రజలకు చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు.