CM Jagan:వీళ్లా వైఎస్సార్ వారసులు..? వివేకా హత్యపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Thursday,April 25 2024]

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తనపై చేస్తున్న ఆరోపణల గురించి సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నామినేషన్‌ కోసం పులివెందుల వెళ్లిన ఆయన.. అంతకుముందు సీఎస్‌ఐ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?.. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా..? ఎవరు ఫోన్‌ చేస్తే అవినాష్‌ అక్కడికి వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు. అవినాష్ ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానని పేర్కొన్నారు.

తనను నేరుగా ఎదుర్కోలేక అంతా కలిసి ఒక్కసారి దాడి చేస్తున్నారని వాపోయారు. అందుకే వివేక హత్య కేసును తెరపైకి తీసుకొచ్చి అవినాష్‌ను టార్గెట్ చేశారని విమర్శించారు. చిన్నవాడైన అవినాష్‌ను నాశనం చేయాలని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్‌ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని.. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలని చెప్పుకొచ్చారు.

'వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?' అంటూ జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు?.. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్‌ వారసులా? పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు అని నిలదీశారు.

వైఎస్సార్ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? అన్నారు. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?.. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?.. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా? అన్నారు. నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.