కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో చిన్న, మీడియం బడ్జెట్ ఫిలిం మేకర్స్ కు ఓటిటి రూపంలో మంచి అవకాశం లభించింది. అలా చిన్న బడ్జెట్ చిత్రం అయిన ' అర్థ శతాబ్దం' నేడు ఆహాలో విడుదలయింది. ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
2003లో తెలంగాణాకి చెందిన సిరిసిల్లలో కథ మొదలవుతుంది. ఆ ఊర్లో కృష్ణ(కార్తీక్ రత్నం) అనే కుర్రాడు ఉంటాడు. ఊర్లో ఫంక్షన్స్ కి లైట్ సెట్టింగ్స్ వేయడం లాంటి పనులు చేస్తూ స్నేహితులతో సరదాగా తిరుగుతుంటాడు. నక్సలైట్ గా ఉన్న రామన్న( సాయి కుమార్) ఉద్యమం వదిలి ఊర్లోకి వచ్చేస్తాడు. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతడి కుమార్తె పుష్ప(కృష్ణ ప్రియ)ని కృష్ణ ప్రేమిస్తుంటాడు.
అతడిని వన్ సైడ్ లవ్. పుష్పకి తన ప్రేమని తెలియజేయాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. కృష్ణకి పుష్పపై ప్రేమతో పాటు దుబాయ్ కి వెళ్లాలనే కోరిక కూడా ఉంటుంది. సరిగ్గా పుష్పకి తన ప్రేమని తెలియజేసే టైంలో కృష్ణ ఓ సంఘటనలో ఇన్వాల్వ్ అవుతాడు.
దీనితో అప్పటి వరకు ఆ ఉర్లో నివురుగప్పిన నిప్పులా ఉండే కులాల గొడవలు ఒక్కసారిగా భగ్గుమంటాయి. దీనితో కథలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితుల నడుమ పుష్పకి కృష్ణ తన ప్రేమని తెలియజేశాడా ? కులాల గొడవలు ఎందుకు చెలరేగాయి ? చివరకు కృష్ణ ప్రేమ ఏమైంది ? ఇదే మిగిలిన కథ.
విశ్లేషణ
దర్శకుడు రవీంద్ర పుల్లే ఈ చిత్రంలో ఎంచుకున్న కథాంశం మంచిదే. కులాల గొడవలపై అనేక చిత్రాలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు కథని ఆసక్తికరంగా చెప్పే వీలు ఉంటుంది. స్వాతంత్రం వచ్చి అర్థ శతాబ్దం అయినప్పటికీ రాజ్యాంగానికి విలువ లేకుండా కులాల గొడవలు అలాగే జరుగుతున్నాయి అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం.
కానీ కథా గమనంలో బలం లోపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా తేలిపోయింది అనే చెప్పాలి. హీరో హీరోయిన్ చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు బోరింగ్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ నుంచి కథలోకి ఎంటర్ అయినప్పటికీ ఆసక్తికరంగా ఏమీ ఉండదు. పల్లెటూర్లో కనిపించిన వ్యక్తిని కనిపించినట్లు చంపేయడం సిల్లీగా ఉంటుంది. ఆ సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి.
ఇక సెకండ్ హాఫ్ లో హీరో ప్రేమలో దర్శకుడు కాస్త ఎమోషన్ ని మిక్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కథలో బలం లేకపోవడం వల్ల ఎమోషన్ పండలేదు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ చుట్టూ తిరిగిన హీరో సెకండ్ హాఫ్ ఎక్కువ భాగం ఆమెచేయి పట్టుకుని పరిగెడుతూ రక్షించే ప్రయత్నం చేస్తుంటాడు.
ప్రీ క్లైమాక్స్ ఓ ఎమోషనల్ సీన్ నుంచి కథ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. క్లైమాక్స్ లో సాయికుమార్ ప్రతిభని దర్శకుడు ఉపయోగించుకుని ఉండొచ్చు. కానీ ఆయన పాత్రని క్లారిటీ లేకుండా వదిలేశారు.
నటీనటులు
హీరో కార్తీక్ రత్నం పేదింటి యువకుడిగా, ప్రేమికుడిగా బాగా నటించాడు. హీరోయిన్ కృష్ణ ప్రియ పెల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో ఆమె లుక్స్ బావుంటాయి.
ఈ చిత్రంలో కథకు బాగా సూట్ అయిన పాత్రలు ఏవైనా ఉన్నాయి అంటే అవి శుభలేఖ సుధాకర్, మహదేవన్ పోషించిన పాత్రలే. ఊరి ప్రెసిడెంట్ గా మహదేవన్ బాగా నటించాడు. కానీ ఆయన పాత్రకు ప్రాపర్ ఎండింగ్ లేదు. ఇక పొలిటీషియన్ గా శుభలేక సుధాకర్ బాగా చేశారు. ఈ ఆయన చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉంటాయి.
రాజ్యాంగాన్ని, ప్రజలని ఉదాహరణలతో వివరిస్తూ శుభలేఖ సుధాకర్ ఆకట్టుకున్నారు. ఎస్సై పాత్రలో నవీన్ చంద్రకూడా బాగానే చేశాడు. సినిమా మొత్తం సాయి కుమార్ ని మంచి భావాలున్న వ్యక్తిగా చూపిస్తారు. కానీ చివర్లో ఆయన పాత్రని సైలెంట్ చేసేయడంతో క్లారిటీ లోపించింది అని చెప్పాలి.
సాంకేతికంగా
ఈ చిత్రంలో రిఫ్రెషింగ్ గా అనిపించేది మాత్రం సినిమాటోగ్రఫీ. విలేజ్ సెటప్ ని బాగా చూపించారు. విజువల్స్ నేచురల్ గా ఉంటాయి. సంగీతం ఓకె అని చెప్పొచ్చు. రెండు పాటలు బావుంటాయి. కథతో పాటు సాగే కొన్ని ఎమోషనల్ సాంగ్స్ వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ ఫీల్ తెప్పించడంలో ఆ సాంగ్స్ ఫెయిల్ అయ్యాయి.
చిన్న బడ్జెట్ మూవీ అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఇక డైలాగుల విషయానికి వస్తే.. కథ తెలంగాణ ప్రాంతానికి చెందినది కాబట్టి ఆ యాసలోనే డైలాగ్స్ ఉంటాయి. కొందరు నటీనటులకు తెలంగాణ యాసలో డైలాగ్స్ సెట్ కాలేదు. ముందుగా చెప్పుకున్నట్లుగా శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్స్ మాత్రం బావుంటాయి. కథ పరంగా దర్శకుడికి వచ్చిన ఐడియాని మెచ్చుకోవచ్చు. కానీ ఆ పాయింట్ చుట్టూ బలమైన కథ అల్లడంలో నిరాశపరిచారు.
ఫైనల్ పంచ్
అర్థ శతాబ్దం చిత్రంలో మంచి కథాంశం ఉన్నపటికీ సిల్లీగా అనిపించే సన్నివేశాలు, బోరింగ్ స్క్రీన్ ప్లేతో నిరాశపరిచి విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా కథ పుంజుకోదు. ప్రేమ, కుల ఘర్షణల్ని మిళితం ఎమోషనల్ గా డ్రైవ్ చేయాలనే దర్శకుడి ప్రయత్నం బెడిసికొట్టింది.
Comments