శ్రియతో కెమిస్ట్రీ బావుందట
- IndiaGlitz, [Thursday,November 16 2017]
పదహారేళ్లుగా కథానాయికగా అలరిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్. ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టి దేవీ పాత్రలో అలరించిన శ్రియ.. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉంది. వాటిలో ఒకటి తెలుగు చిత్రం వీరభోగ వసంతరాయలు కాగా.. మరొకటి తమిళ చిత్రం నరగాసురన్.. మూడోది హిందీ చిత్రం తడ్కా.
నరగాసురన్ విషయానికి వస్తే.. 16 అనే తమిళ అనువాద చిత్రంతో బ్రిలియంట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో శ్రియకి జోడీగా అరవింద్ స్వామి నటిస్తున్నాడు. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్.. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది.
కాగా, ఈ సినిమా సమయంలో శ్రియతో కలిసి పనిచేయడంపై అరవింద్ స్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శ్రియతో పనిచేయడం ఆహ్లాదకరంగా ఉందని, గీత - ధ్రువ పాత్రల్లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరకు ఉత్తేజాన్నిస్తుందని చెపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా నరగాసురన్ చిత్రం నరకాసురుడు పేరుతో తెలుగులోనూ అనువాదం కానుంది. ఫిబ్రవరిలో రెండు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.