Aranya Review
తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా తనదైన మార్కును క్రియేట్ చేసుకున్న హీరో రానా దగ్గుబాటి. ఈ వెర్సటైల్ యాక్టర్ చేసిన మరో డిఫరెంట్ మూవీ అరణ్య. ప్రకృతి, పర్యావరణం, ఏనుగులు అనే కాన్సెప్ట్‌తో గజరాజు వంటి సినిమాను చేసి ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు రానా లుక్.. ఈ సినిమా కోసం పడ్డ కష్టం అన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ అంచనాలను సినిమా ఎంత వరకు రీచ్ అయ్యింది. సినిమా సక్సెస్ అయ్యిందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ప్రకృతి, వన్య ప్రాణులు అంటే ప్రాణమిచ్చే వ్యక్తి నరేంద్ర భూపతి(రానా దగ్గుబాటి). ఆయన పూర్వీకులు ఐదు వందల ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిచ్చేస్తారు. ఆ అడవికి నరేంద్ర సంరక్షకుడిగా ఉంటాడు. అడవిలో ఉండే మనుషులకే కాదు, ఏనుగులకు తోడుగా ఉంటాడు నరేంద్ర. దీంతో అందరూ ఇతన్ని అరణ్య అని పిలుస్తుంటారు. లక్షకు పైగా మొక్కలు నాటి అటవీ సంరక్షణకు పాటు పడిన నరేంద్రను రాష్ట్రపతి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డుతో కూడా సత్కరిస్తాడు. అయితే నరేంద్రభూపతి ఉండే అటవీ ప్రాంతంలో ఓ టౌన్‌షిప్ కట్టడానికి అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) ప్లాన్ చేస్తాడు. అందుకు తగినట్లు పావులు కదుపుతూ అరవై ఎకరాల అడవిని నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే ఆ అడవికి సంరక్షుడిగా ఉండే అరణ్య ఏం చేశాడు? మంత్రి ప్రణాళికలను ఏ విధంగా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అరణ్యకు మంత్రి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? చివరకు అరణ్య అడవిని ఎలా కాపాడుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
మనిషి స్వార్థ జీవి. తను హాయిగా ఉండటానికి ప్రకృతిని నాశనం చేయడానికి కూడా వెనుకాడడు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం అరణ్య. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది వరకు ఈయన డైరెక్ట్ చేసిన అనువాద చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను మైనా, గజరాజు చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గజరాజు చిత్రాన్ని ప్రభు సాల్మన్ ఏనుగు అనే కాన్సెప్ట్‌తో చేశాడు. అయితే గజరాజు సినిమాలో ఒకట్రెండు ఏనుగులుంటాయి. కానీ అరణ్య సినిమాలో ఇరవైకి పైగా ఏనుగులుంటాయి. ఏనుగులుండే అడవిని కాపాడే ఓ రక్షకుడు కథ అని సింపుల్‌గా అనుకోవచ్చు. కానీ.. సినిమాను తెరకెక్కించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఏనుగులతో నటింప చేసుకోవాలి. ప్రభు సాల్మన్ ఈ సినిమాను తెరకెక్కించడానికి పడ్డ కష్టం మామూలుది కాదు. అయితే చెప్పాల్సిన విషయాన్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు డైరెక్టర్ ప్రభుసాల్మన్. కథా గమనం ఏటో వెళ్లిపోతుంటుంది. సాధారణంగా ప్రభు సాల్మన్ సినిమా అంటే ఓ ఎమోషనల్ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఎమోషనల్ కనెక్టింగ్ పాయింట్ మిస్ అయ్యింది. విఎఫ్ఎక్స్ వర్క్ బావుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్.అశోక్ కుమార్ ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో బంధించడానికి చాలానే కష్టపడ్డాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎడిటర్ భువన్ సినిమాను అర్థం కాక అలా వదిలేశాడా? లేక ఏం చేయలేమనే ఉద్దేశంతో వదిలేశాడా? అనే ఫీలింగ్ సినిమా చూసిన ప్రేక్షకుడికి వస్తుంది. రసూల్ పూకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ బావున్నా..ఎమోషన్స్ కనెక్టింగ్‌గా లేదు. సింగ పాత్రకు, అతని ప్రేయసి లవ్ ట్రాక్ ఆకట్టుకోదు.. ఏనుగులతో రానాకు ఉన్న ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతాయని భావించిన దర్శకుడు దానిపై ఫోకస్ పెట్టలేదేంటనిపిస్తుంది. కథలో మావోయిస్ట్ ఎపిసోడ్ ఇరికించినట్లు అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. కథానాయకుడు, ప్రతి నాయకుడనే భావన లేదు. పాత్ర బావుంటే నటించడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసి.. ఆ పాత్రకు న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడే యాక్టర్స్‌లో రానా ఒకడు. అరణ్య పాత్రను ఆయన క్యారీ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ ఫార్మేట్ సినిమాలే చేయాలని కాకుండా అరణ్య పాత్రను చేయడానికి ఒప్పుకున్నందుకు రానాను అభినందించాల్సిందే. పాత్ర కోసం తను పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. సింగ పాత్రలో విష్ణు విశాల్ ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్‌లో ఆ పాత్ర ఏమైపోతుందో ఎవరికీ అర్థం కాదు. సినిమా చూసే సగటు ప్రేక్షకుడి అసలు సింగ పాత్ర ఏమైంది.. అలాగే రిపోర్టర్‌గా నటించిన శ్రియ పిల్గాంకర్ పాత్రలు సెకండాఫ్‌లో కనిపించదు. దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ విషయం ఆలోచించాడా? లేదా? అనే సందేహం కూడా వస్తుంది. అనంత్ మహదేవన్ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించాడు. పాత్రలు బావుంటే కాదు.. కనెక్ట్ అయ్యే కథాంశం మాత్రం లేదు.
బోటమ్ లైన్: అరణ్య.. అందరినీ మెప్పించలేడు
- Read in English