ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం
- IndiaGlitz, [Monday,December 28 2020]
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లిగారైన కరీమా బేగం నేడు మృతి చెందారు. చిన్నతనంలోనే రెహ్మాన్ తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతంతా ఆయన మాతృమూర్తే భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే రెహ్మాన్ తండ్రి మరణించడంతో.. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కరీమా బేగం కుటుంబాన్ని పోషించేవారు. రెహ్మాన్‌తో పాటు ముగ్గురు ఆడపిల్లల బాధ్యతను ఆమే తీసుకున్నారు. రెహ్మాన్‌కు 11 సంవత్సరాలు రాగానే.. కుటుంబ బాధ్యతల్లో తల్లికి చేదోడుగా ఉంటూ వచ్చారు.
రెహ్మాన్ తన జీవితాన్ని తల్లి నగలు అమ్మి ప్రారంభించారు. తల్లి నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో తన ఇంట్లోనే ఒక అద్భుతమైన స్టూడియోను ప్రారంభించారు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆ సమయంలోనే అంటే 1989లో వీరి కుటుంబం ఇస్లామ్ మతంలోకి మారింది.