త్రిష కోసం మురుగదాస్ ఏం చేశారంటే...
- IndiaGlitz, [Friday,April 12 2019]
త్రిష ఇప్పుడు క్లౌడ్ నైన్లో ఉన్నారు. ఆ మధ్య వరకూ సక్సెస్లు లేక సతమతమైన త్రిష కెరీర్ ఉన్నట్టుండి గాడిలో పడింది. చేతిలో మాంఛి సినిమాలు పడ్డాయి. విజయ్ సేతుపతి నటించిన '96' ఆమెకు కెరీర్లో చాలా మంచి సినిమా అయింది. అందులోని జాను పాత్రలో చాలా మంది అమ్మాయిలు తమను తాము ఊహించుకున్నారు. చదువుకునే రోజుల్లో జీవితం వేరు, పెళ్లయిన తర్వాత జీవితం వేరు... రెండిటి మధ్య కన్ఫ్యూజన్ ఉండకూడదు కానీ, కొన్నిసార్లు మనసు మాట వినదు, అలాంటప్పుడు జీవితం ఏంటనే విషయాన్ని చాలా హృద్యమైన సంఘటనలతో చెప్పారు ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్.
అందుకే ఆ సినిమా అందరి హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్లింది. ఆ తర్వాత ఆమె రజనీకాంత్ సరసన పేట్టలోనూ నటించింది. తాజాగా సిమ్రన్, త్రిష కలిసి సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'జర్నీ' ఫేమ్ శరవణన్ దర్శకత్వంలో త్రిష ఓ సినిమా చేయబోతున్నారు. దానికి మురుగదాస్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. స్క్రిప్ట్ లో కీలకమైన లాక్స్ అన్నిటినీ ఆయనే హ్యాండిల్ చేశారని వినికిడి. ఓ వైపు రజనీకాంత్ సినిమా 'దర్బార్', మరో వైపు త్రిష సినిమా స్క్రిప్ట్ లాక్ చేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారట మురుగదాస్.