'దర్బార్' సినిమా చూసి ప్రతి ఒక ప్రేక్షకుడు అలాగే ఎంజాయ్ చేస్తాడు - డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్
Send us your feedback to audioarticles@vaarta.com
గజినీ, స్టాలిన్,7 సెన్స్, తుపాకీ, కత్తి, సర్కార్ వంటి చిత్రాలతో భారీ విజయాలను సాధించిన దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన మరో భారీ కమర్షియల్ చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంక్రాంతి సందర్బంగా జనవరి 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్‌తో ఇంటర్వ్యూ...
రజినీకాంత్‌లాంటి స్టార్ హీరో మీకోసం 15 ఏళ్లు వెయిట్ చేశానని చెప్పడం ఎలా అనిపించింది
నేను చేసిన గజినీ చాలా పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన ఇంటికి పిలిపించారు. అప్పుడు సాధారణంగానే మాట్లాడారు. ఏడాది తర్వాత నాకు ఫోన్ చేసి ఓ సినిమా చేద్దామని అన్నారు. నేను సరే అన్నాను. అయితే ఆ సమయంలోనే హిందీలో గజినీ రీమేక్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సూర్య గారితో 7 సెన్స్ సినిమా చేశాను. అలాగే రజినీగారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరకు ఏడాదిన్నర క్రితం ఫోన్ చేసి ఈ సారి మనం కచ్చితంగా సినిమా చేయాలని అన్నారు. ఈ ఛాన్స్ మిస్ చేయకూడదని నేను నిర్ణయించుకుని కథను తయారు చేశాను. విషయం తెలిసిన తర్వాత అందరూ ఫోన్ చేసి నన్ను అభినందించారు. ఆ సమయంలో నేను నిజంగానే టెన్షన్ ఫీలయ్యాను. పక్కా స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నాను.
రజినీకాంత్‌ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
నేను చిన్నప్పుడు అమ్మతో కలిసి సినిమా చూసినప్పుడు రజినీకాంత్‌గారు ఈ థియేటర్లోనే ఉన్నారనుకునేవాడిని. తర్వాత అక్కడ నుండి మా అక్క వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు అక్కడ థియేటర్‌లోనూ రజినీకాంత్‌గారిని చూసి అదేంటి మా ఊరిలో ఉండకుండా ఇక్కడున్నారు? అనుకున్నాను. అప్పుడు మా అక్కయ్య నాకు అసలు విషయాన్ని చెప్పారు. అప్పుడే నాకు సినిమా గురించి తెలిసింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు మన్నన్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన్ని దూరంగా చూశాను. గజినీ సమయంలో ఆయన్ని దగ్గరగా కలిశాను. ఆయనలో తెలియని ఎట్రాక్షన్ ఉంటుంది. నేను ఆయన్ని చూసి ఎలా ఎంజాయ్ చేశానో.. అలాగే నేటి ట్రెండ్‌కు తగినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా చేశాను.
ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉంటుంది?
ముంబైలో బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్ స్టోరీ ఇది. రీసెంట్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్ మా సినిమాకు కనెక్ట్ అవుతుంది. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా ఓ చిన్న మెసేజ్ ఉంటే ప్రజలకు అది త్వరగా రీచ్ అవుతుంది.
షూటింగ్ సమయంలో రజినీతో మరచిపోలేని జ్ఞాపకం?
ప్రతిరోజూ మరచిపోలేని జ్ఞాపకం. ఉదాహరణకు ఓ సన్నివేశాన్ని చిత్రీకరించాలంటే వర్షం పడుతూనే ఉంది. మూడు రోజుల తర్వాత కూడా వాన తగ్గలేదు. ఆ సమయంలో రజినీగారు వర్షంలోనే షూటింగ్ పూర్తి చేశారు. అంత పెద్ద స్టార్ అయిన కూడా రజినీగారు చక్కగా కో ఆపరేట్ చేశారు.
రజినీకాంత్‌ను చూసి వ్యక్తి ఏం నేర్చుకున్నారు? టెక్నీషియన్‌గా ఏం నేర్చుకున్నారు?
నటుడిగా ఆయనది 40 సంవత్సరాల ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా మంది హీరోల సినిమాలు ఈయన సినిమాలతో పోటీ పడుంటాయి. ఈ పోటీని మీరెలా చూస్తారు? అని నేను రజినీకాంత్‌గారిని ఓ సందర్భంలో అడిగితే `నేను నా సినిమాల గురించే ఆలోచిస్తాను. ఇతరుల సినిమాల గురించి ఆలోచించను. అలాగే నేను ఇతర హీరోల సినిమాలు చూసేటప్పుడు సినిమా ఫ్యాన్‌లా భావించి సినిమా చూస్తాను. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత సినిమాల గురించి ఆలోచించడం మానేస్తాను` అన్నారు. `మీరు కూడా మీ గత చిత్రాల్లో ఏం తప్పులు చేశారు. దాన్నెలా అధిగమించాలి, ఇంకా సినిమా బాగా ఎలా చేయాలని ఆలోచించండి` అంటూ నాకొక సలహా ఇచ్చారు. ఇదే టెక్నీషియన్‌గా ఆయన్నుండి నేను నేర్చుకున్నాను. ఇక వ్యక్తిగా అంటే ఆయన ఎక్కువగా దేవుడు, ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతారు. వాటికి సంబంధించిన పుస్తకాలను నాకు ఇచ్చారు కూడా.
కత్తి తర్వాత దర్బార్ సినిమాను లైకా ప్రొడక్షన్ చేయడం ఎలా అనిపించింది?
సుభాస్కరన్‌గారి మొబైల్‌కంపెనీ, సిమ్ కార్డులు 25 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఆయన హెడ్ ఆఫీస్ లండన్‌లో ఉంటుంది. అక్కడకెళితే 5000 మంది పనిచేస్తుంటారు. బ్రిటీషర్స్ ఇక్కడ మనల్ని పాలించి వెళ్లారు. కానీ మనవాడు ఇప్పుడు అక్కడ వాళ్లకు బాస్‌గా ఉన్నారు. ఆ విషయాన్ని తలుచుకుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది.
నయనతారతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
చాలా సంవత్సరాల తర్వాత నయనతారగారితో కలిసి పనిచేశాను. రజినీసార్, నయనతారగారు మాత్రం వయసు అయ్యే కొద్ది యంగ్ అవుతున్నారు. అనిరుధ్‌గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. రెండు రోజుల క్రితమే సినిమా ఫైనల్‌ని లాక్ చేశాం.
సునీల్ శెట్టి పాత్ర ఎలా ఉండబోతోంది?
రజినీకాంత్‌గారి పాత్రకు ధీటుగా మంచి విలన్ కావాలి. అందుకని సునీల్ శెట్టిగారిని ఎంపిక చేశాం. ఆయన అద్భుతమైన విలనిజాన్ని తెరపై ఆవిష్కరించారు.
ఎన్.వి.ప్రసాద్ గురించి చెప్పండి?
ప్రసాద్‌గారితో చాలా కాలం నుండి మంచి అనుబంధం ఉంది. ఆయనతో మాట్లాడుతుంటే.. మన ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. ఆయన దర్బార్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది.
నెక్ట్స్ మూవీ ఏంటి?
ఇంకా నేను ఏ సినిమా చేయాలో నిర్ణయించుకోలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెబుతాను.
తెలుగులో స్ట్రయిట్ సినిమా ఎప్పుడు చేస్తారు?
చేస్తాను. తమిళంలో హీరోల ఇమేజ్‌ను బేస్ చేసుకుని సినిమాలను చేస్తున్నాను. కానీ తెలుగులో ఎందుకనో అది మిస్ అవుతుంది. మహేశ్ లాంటి హీరోతో చేసిన సినిమా ఎక్కడో మిస్ అయ్యింది. ఆయనలాంటి డేడికేషన్ అమేజింగ్. దాని వల్లే బై లింగువల్ మూవీ చేయగలిగాను. ఆయనలాంటి హీరోకు ప్లాప్ ఇచ్చామనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. చాలా స్వచ్ఛమైన వ్యక్తి. దర్బార్ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆయనే విడుదల చేశారు.
బన్నీతో సినిమా చేస్తారని వార్తలు వినపడుతున్నాయిగా?
ప్రస్తుతం సినిమా చర్చల దశలోనే ఉందండీ.. ఇప్పుడే చెప్పలేను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments