Telangana Governor:తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం.. ఎవరంటే..?
- IndiaGlitz, [Tuesday,March 19 2024]
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం కొత్త గవర్నర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటంతో గవర్నర్ నియామకం సాధ్యం కాదు. దీంతో పూర్తి స్థాయి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన 1998, 1999లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలదించారు. అయితే 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఓటమి పాలయ్యారు. పార్టీకి ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది.
ఇదిలా ఉంటే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తమిళిసై సౌందర్ రాజన్ గవర్నర్ పదవికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నియోజకవ్గరం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఆమె ఇంతవరకు ఎన్నికల్లో విజయం సాధించలేదు. అందుకే ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై.. దాదాపు నాలుగన్నర సంవత్సరాల పాటు ఆ పదవిలో విధులు నిర్వర్తించారు.