Election Commission: కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్లు నియామకం.. శుక్రవారమే ఎన్నికల షెడ్యూల్..!
- IndiaGlitz, [Thursday,March 14 2024]
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరు కమిషనర్లను హైపవర్డ్ కమిటీ ఎంపిక చేసిందని లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. నూతన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం ప్రకారం నూతన కమిషనర్లను నియమించారు. గతంలో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ ఎఫైర్స్‌లో పనిచేశారు. కాగా అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది.
ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిపార్సుల ఆధారంగా ఈ నియామకం చేపట్టారు. ఎంపిక చేసిన ఈ ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకం అధికారికం కానుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌బీర్ సింగ్ ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి 31న పదవి విరమణ చేశారు. అలాగే గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.
మరి కొద్ది రోజుల్లోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకుచీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి ఈ ఇద్దరు కమిషనర్లు పూర్తి స్థాయిలో సహకరించనున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం లేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈసీల నియామకానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. విచారణ తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.