సాయిధరమ్ తేజ్‌కు విజయవంతంగా కాలర్ బోన్ సర్జరీ... 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే

  • IndiaGlitz, [Monday,September 13 2021]

రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం అపోలో వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కాలర్‌ బోన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం సాయి తేజ్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయనను తిరిగి ఐసీయూకు తరలించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్‌ బైక్‌ నుంచి కిందపడి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి అక్కడి నుంచి జూబ్లీహిల్స్ అపోలోకి తరలించారు. సాయి తేజ్ ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, చిరు భార్య సురేఖ, పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.

ఇక సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. తేజూ నడిపిన బైక్ అనిల్‌ కుమార్‌ పేరుతో ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌ నుంచి ట్రంప్‌ బైక్‌ను సాయితేజ్‌ కొనుగోలు చేశారని.. వాహనం ఇంకా అనిల్‌ పేరు మీదే ఉందని, సాయితేజ్‌ పేరు మీదకు మార్చుకోలేదు వెల్లడించారు. గతేడాది ఆగస్టు 2న ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినందుకు సాయి బైక్‌పై 1,135 రూపాయల జరిమానా పడిందని.. ఈరోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారని డీసీపీ వివరించారు.

ప్రమాదానికి గురైన రహదారిపై 30 కి.మీ పరిమిత వేగంతో వెళ్లాలని.. కానీ, కేబుల్ బ్రిడ్జిపై సాయితేజ్‌ బైక్‌ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ 75 కి.మీ వేగంతో ఉందని.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో స్పీడ్ లిమిట్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేశామని డీసీపీ వెల్లడించారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వెంకటేశ్వర్లు చెప్పారు. సాయితేజ్‌కు కారు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందని.. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలు తెలియాల్సి వుందని డీసీపీ స్పష్టం చేశారు.