విశాఖ ఉక్కు.. వైసీపీనోరు మెదపదేం?
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటు టీడీపీ నేతలు, అటు సామాన్య ప్రజానీకం మండిపడుతోంది. కానీ అధికార వైసీపీ మాత్రం ఒక్కటంటే ఒక్క మాట కూడా దీనిపై స్పందించింది లేనే లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా వైసీపీ సహకారంతోనే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నో పోరాటాల తర్వాత.. 32 మంది ప్రాణత్యాగాలతో సంపాదించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడంపై ఏపీ వాసులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు సైతం తమ అధినేత ఎటువంటి స్టాండ్ తీసుకోకపోవడంతో మీడియా ముందుకు వచ్చినప్పుడు దానిపై ప్రశ్నలు ఎదురైతే ఎలా ఆన్సర్ చేయాలా.. అనే దానిపై ఏకంగా ఆ పార్టీ ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
తాజాగా.. వైసీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల ముందుకువచ్చారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వంతు వచ్చింది. ‘విజయసాయి రెడ్డి గారు విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడమన్నారు’... అని పక్కనే ఉన్న ఎంపీ బాలశౌరితో అన్నారు. ‘‘కాదు... దానిపై పార్టీ స్టాండ్ తీసుకుంటుంది.. దానిపై మాట్లాడవద్దని చెప్పారు. ఇప్పుడే వద్దు, సీఎం గారు ఒక వైఖరి తీసుకుంటారని చెప్పారు’’ అని బాలశౌరి బదులిచ్చారు. ‘మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు’ అని పిల్లి సుభాష్ మరోసారి అడగారు. ‘చెప్పండి. మామూలువి ఉంటాయి కదా! చంద్రబాబునాయుడు అవి..’ అని బాలశౌరి సూచించారు. దీనిని బట్టి విశాఖ ఉక్కుపై మాట్లాడలేక.. మాట్లాడకుండా ఉండలేక ఎంపీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ ఎంపీ మాత్రం పార్టీతో సంబంధం లేకుండా ఒక స్టాండ్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే స్టీల్‌ప్లాంట్ గేటు వద్దనే నిరాహార దీక్షకు దిగుతానని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకవేళ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే రాజీనామాలకు సిద్ధం కావాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీంతో ఒకవేళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రేవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం ఏపీలో మరో ఉద్యమం ఉప్పెనలా వచ్చే అవకాశం లేకపోలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com