2024లో ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారనుందా..?

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా..? ఈసారి రాష్ట్ర ముఖచిత్రం మారనుందా..? కొంతమంది రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకం కానుందా..? గెలిచిన పార్టీ అందలం ఎక్కడం.. ఓడిన పార్టీలు రాజకీయంగా ఘోర పరిస్థితి ఎదుర్కోనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల సమరంలో ఢీ అంటే ఢీ అంటూ తలపడనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

మళ్లీ అధికారంలోకి వచ్చేలా కసరత్తు..

ముందుగా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత సీఎం జగన్.. వేగంగా రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మొహమాటం లేకుండా మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను మార్చేశారు. మరో 40-50 మందిని కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. అంసతృప్తి ఎదురవుతున్నా సరే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుజ్జగింపులు కూడా చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లనున్నారు. ఏదేమైనా మళ్లీ పవర్‌లోకి రావడమే అజెండాగా జగన్ పావులు కదుపుతున్నారు.

వైసీపీని గద్దె దించడమే ఉమ్మడి లక్ష్యం..

ఇక ప్రతిపక్ష టీడీపీ ఈసారి అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని ఓ అడుగు ముందుకేసింది. తమ సొంత క్యాడర్ బలంతో పాటు జనసైనికుల బలం కూడా చేరడంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పలు మార్లు భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఆ విధంగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. త్వరలోనే వరుస సభలు పెట్టి ఎన్నికల బరిలో దిగనున్నారు. అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అవసరమైతే బీజేపీ, కమ్యూనిస్టులను కూడా కలుపుకుని వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు

కాంగ్రెస్ అస్త్రంగా వైయస్ షర్మిల..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు ఉవిళ్లూరుతోంది. రాష్ట్ర విభజనతో భూస్థాపితమైన పార్టీకి ఆక్సిజన్ ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం దివంగత నేత వైఎస్సార్ కుమార్తె, సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిలను తమ అస్త్రంగా ఉపయోగించనుంది. ఇప్పటికే షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఆ పార్టీకి మళ్లీ పునరుత్తేజం రానుంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా ఇతర పార్టీల గెలుపు అవకాశాలను శాసించేలా ప్లాన్‌ చేస్తుంది. అనంతరం 2029లో అధికారమే టార్గెట్‌గా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది.

పార్టీలకు డ్యూ ఆర్ డై సమస్య..

మొత్తానికి ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ గెలిస్తే వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ-జనసేన రాజకీయ భవిష్యత్ డైలమాలో పడుతుంది. అదే టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం రాజకీయంగా వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఆ పార్టీలో కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారనుంది. మరి 2024లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందో తెలియాలంటే మరో రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిందే.

More News

Jagananna Arogya Suraksha: నేటి నుంచే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) రెండో దశ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పట్టణాలు

Jr NTR: నా గుండె తరుక్కుపోతోంది.. జపాన్ ప్రజలు ధైర్యంగా ఉండండి..

కొత్త ఏడాది జపాన్ దేశం ప్రజల్లో భయంకరమైన అలజడి తీసుకొచ్చింది. వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికలతో ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు

YSRCP: తాజా సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం.. మరోసారి అధికారం ఖాయం..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు పోల్ సమరానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి రానుందో ముందే అంచనా

Numaish:నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం.. అప్పటివరకు ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది.  నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు.

Rajasingh: బిర్యానీ బాలేదన్నందుకు కస్టమర్స్‌ను చావబాదారు.. రాజాసింగ్ ఆగ్రహం..

బిర్యానీ బాగలేనందుకు హైదరాబాద్‌లోని ఓ హోటల్ సిబ్బంది కస్టమర్లపై వీరంగం సృష్టించారు. చేతికి అందిన కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి.