Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..
- IndiaGlitz, [Saturday,June 03 2023]
ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలికాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రమాదంలో మరణించిన, గాయాలైనవారిలో ఒడిషా, బెంగాల్ వాసులే అధిక సంఖ్యలో వున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు వాసులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదం విషయం తెలియగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్ చేయించుకున్న తమ వారి క్షేమ సమాచారం కోసం ఏపీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమార్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్‌లలో విజయవాడ వాసులు 47 మంది, రాజమహేంద్రవరం వాసులు 22 మంది, ఏలూరుకు చెందిన ఒకరు ఇలా 70 మంది వరకు వున్నారు. ఇక యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్తున్న మరో ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి, రేణిగుంట, చీరాలకు చెందిన 52 మంది ప్రయాణీకులు ఎక్కినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరందరి క్షేమ సమాచారంపై బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఒడిషా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే ఘటనాస్థలికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని పంపించారు. కలెక్టరేట్‌లలో హెల్ప్‌లైన్ నెంబర్లు, ఒడిషా సరిహద్దులోని జిల్లాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు.
ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హైల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
ఒడిశా ప్రభుత్వం- 06782-262286.
రైల్వే హెల్ప్‌లైన్లు:
హౌరా 033-26382217;
ఖరగ్‌పూర్ 8972073925
బాలేశ్వర్ 8249591559;
చెన్నై 044-25330952
వాల్తేరు డివిజన్..
విశాఖ : 08912 746330, 08912 744619
విజయనగరం : 08922-221202, 08922-221206.
దక్షిణ మధ్య రైల్వే :
సికింద్రాబాద్ రైల్ నిలయం (040 27788516)
విజయవాడ రైల్వే స్టేషన్ (0866 2576924)
రాజమండ్రి రైల్వే స్టేషన్ (0883 2420541)
రేణిగుంట రైల్వే స్టేషన్ (9949198414)
తిరుపతి రైల్వే స్టేషన్ (7815915571)
నెల్లూరు రైల్వే స్టేషన్ (08612342028)