ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం.. విచిత్రమేంటంటే...
- IndiaGlitz, [Wednesday,July 22 2020]
ఏపీ మంత్రులుగా నేడు వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది.
కాగా.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వ్యాపారవేత్త ఆయనకు 2001లో రాజోలు నుంచి జడ్పీటీసీ సీటు లభించింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అనంతరం 2006లో మలికిపురం జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. 2014లో ఎమ్మెల్యేగా వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనూహ్యంగా రామచంద్రాపురం సీటును వేణుగోపాలకృష్ణ దక్కించుకున్నారు.
విచిత్రమేంటంటే... నిజానికి ఆ స్థానం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేయాల్సి ఉండగా.. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. ఆయనను వేరే నియోజకవర్గానికి మార్చి వేణు గోపాలకృష్ణకు ఆ స్థానాన్ని కేటాయించారు. తాజాగా అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన మంత్రి స్థానం వేణు గోపాలకృష్ణకు దక్కింది.
అప్పలరాజు విషయానికి వస్తే.. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ‘సేఫ్’ ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజావైద్యునిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయనకు 2019లో వైసీపీ నుంచి సీటు లభించింది. వైద్యునిగా మంచి గుర్తింపు ఉండటంతో తొలిసారిగా పోటీ చేసినప్పటికీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.