పవన్‌ కల్యాణ్‌నే టార్గెట్ చేసిన ఏపీ మంత్రి!

  • IndiaGlitz, [Friday,November 01 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌‌పై ఏపీ మంత్రి ఒకరు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దృష్టి అంటే మీరు అనుకున్నది కాదండోయ్.. మీడియా ముందుకొస్తే చాలు అచ్చంగా ఆయన పవన్ గురించే మాట్లాడుతున్నారు.. జనసేనానిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ అసలు కథ. ఇంతకీ ఎవరా మంత్రి..? ఆయన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇసుక కొరతపై యుద్ధం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి అట్టర్ ప్లాప్ అయిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ మధ్య వైసీపీ సర్కార్ చేస్తున్న పనులను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘ఇసుక కొరత’ ఉందని.. తద్వారా భవన కార్మికులు చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇటీవలే హడావుడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ వ్యవహారంపై నవంబర్-03న విశాఖ వేదికగా మిలియన్ మార్చ్ నిర్వహించడానికి పవన్ సిద్ధమయ్యారు. అంతేకాదు.. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా పలు పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమేనని.. అందుకే ప్రభుత్వం వారోత్సవాలు చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించి ఇసుక కొరత ఉందన్న మాట ఎక్కడా రాకుండా చేయాలన్నదే లక్షంగా వైఎస్ జగన్ సర్కార్ కంకణం కట్టుకున్నది. అయితే ఈ క్రమంలో టీడీపీ, జనసేన.. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు, మిలియన్‌ మార్చ్‌లు నిర్వహించడానికి సిద్ధమవుతుండగా.. మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, అధికారప్రతినిధులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

ఓన్లీ అవంతి ఆన్ పవన్!

అయితే.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం పవన్‌నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మీడియా ముందుకొస్తే చాలు పవన్ అనే మాట తప్ప ఈయనకు మరోమాట రావట్లేదు. అంటే ఇందులో ఇంకో లాజిక్.. పవన్ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నది విశాఖ నుంచే గనుక.. తాను విమర్శించకపోతే ఇంకెవరిలా చేయాలి అని ఇలా చేస్తున్నారో లేకుంటే.. ఎక్కడ మార్చ్ సక్సెస్ అవుతుందని ఇలా చేస్తున్నారన్నది ఆయనకే ఎరుక. అందుకే పవన్ ఏం మాట్లాడిన కొన్ని నిమిషాల గ్యాప్‌లోనే కౌంటరివ్వడం.. పవన్ మీ పార్టీని టీడీపీలో విలీనం చేసేయండి అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రేంజ్‌లో వైసీపీకి చెందిన మంత్రులు, నేతలు ఎవరూ పవన్‌ను టార్గెట్ చేయట్లేదు.. ‘ఓన్లీ అవంతి ఆన్ పవన్’ అన్నట్లుగా మంత్రిగారే కౌంటర్ ఎటాక్ చేస్తూ వస్తున్నారు.

కౌంటర్ ఎటాక్ ఉంటుందా..!?

ఇప్పటికే జనసేనానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన అవంతి తాజాగా.. సీఎం జగన్ నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం పవన్‌కు ఏంటి..? అని నిలదీశారు. వాస్తవాలు మాట్లాడుతూ హుందాగా వ్యవహరించి గౌరవం నిలుపుకోవాలని ఈ సందర్భంగా పవన్‌కు మంత్రి హితవు పలికారు. అంతటితో ఆగని ఆయన... వైసీపీ నేతలపై విమర్శలు చేయకుండా, ఎన్నికల్లో జనసేన ఎందుకు ఓడిపోయిందో కారణాలు విశ్లేషించుకుంటే బాగుంటుందని అవంతి సూచించారు. చంద్రబాబు మీద అంత ఇష్టం ఉంటే జనసేనను టీడీపీలో విలీనం చేయాలని మరోసారి పవన్‌‌కు అవంతి సూచించారు. అయితే ఎల్లుండి జరగనున్న మిలియన్ మార్చ్ వేదికగా అవంతి గురించి పవన్ ఏం మాట్లాడుతారో..? ఎలా మాట్లాడుతారో..? లైట్ తీసుకుంటారో..? అనేది తెలియాల్సి ఉంది.