గుండెపోటుతో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో గుండెపోటుకు గురైన ఆయన కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో మేకపాటి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గౌతమ్ రెడ్డి 9.16 గంటలకు మరణించినట్లు అపోలో ఆసుపత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గౌతమ్‌రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొంటున్న ఆయన.. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో విజయవంతంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ పర్యటన ముగించుకుని గౌతమ్ రెడ్డి ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు.
పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడే గౌతమ్ రెడ్డి. హైదరాబాద్ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యూషన్, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు గౌతమ్ రెడ్డి. 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు. ఆయనకు భార్య మేకపాటి శ్రీకీర్తి, ఒక కుమార్తె , ఒక కుమారుడు వున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గౌతం రెడ్డి వరుసగా విజయం సాధించారు.
2014లో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యేగా గౌతమ్ రికార్డు సృష్టించారు. 2019లో బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించారు. ఆ సమయంలో జగన్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆయన కేబినెట్‌లో గౌతం రెడ్డి చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో చికిత్స తీసుకుని కోలుకొన్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి మంచి గుర్తింపు వుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి వీరి స్వగ్రామం. 1985లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా.. 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావుపేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్లమెంట్‌సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజమోహన్ రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గౌతమ్ రెడ్డి బాబాయ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2004, 2009, 2012, 2019ల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments