జనసేనలో చేరికపై మంత్రి గంటా క్లారిటీ
- IndiaGlitz, [Monday,February 04 2019]
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరికను తాను ఒప్పుకోవట్లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం విశాఖ సభావేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేది లేదు. గంటా ఆలోచన ధోరణి జనసేనకు సరిపడదు.. గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారు. అలాంటి పక్షులను నమ్మను. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదు. పార్టీలోకి వచ్చినా వారు దోచుకున్నదంతా ప్రజలకు పంచిపెట్టే సంస్కారవంతులు కావాలి అని అపట్లో పవన్ చెప్పుకొచ్చారు. అసలు ఈ ఆహ్వానంపై ఇంత వరకూ స్పందించని గంటా తాజాగా ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.
గంటా క్లారిటీ..
నేను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమే. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారు. నా గెలుపులో పవన్ మాత్రం ఉంది.. నిజమే ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన వల్లే గెలిచానని చెప్పడం సరికాదు. రాజకీయాలపై పవన్ ఇంకా చాలా అవగాహన పెంచుకోవాలి అని మంత్రి గంటా స్పష్టం చేశారు.
అయితే గంటా తాజా వ్యాఖ్యలపై పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తెలియాల్సి ఉంది. పవన్ మరోసారి మీడియా ముందుకొస్తే.. పార్టీలోకి వస్తానని అసలు గంటా ఎవర్ని సంప్రదించారు..? పవన్ ఎందుకు అంగీకరించలేదు..? అనే విషయాలు నిగ్గుతేలే అవకాశముంది.