సినిమాల్లోనుంచి బయటికి రా పవన్ .. నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!
- IndiaGlitz, [Saturday,September 07 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి, గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజధాని మార్పుతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసిన జనసేనాని.. ‘బొత్సా ఏమైనా ముఖ్యమంత్రా.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. రాజధాని మీకు ఒక్కరికే కాదు..’ ఇలా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. అయితే తాజాగా పవన్ వ్యాఖ్యలకు బొత్స మీడియా ముందుకొచ్చి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
పవన్ సినిమా నుంచి బయటికి రా!
‘పవన్ కల్యాణ్ ఇప్పటికైనా సినిమా ప్రపంచం నుంచి బయటకు రావాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో రాజధాని ఉండాలని అంటున్నారు. పవన్ గతంలో రాజధానికి ఐదు వేల ఎకరాలు సరిపోతాయని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలో ఆయన చెప్పారా లేదా..? ఇప్పుడు మంత్రులు ఎలా ఉండాలో.. ఎలా పనిచేయాలో పవన్ చెప్పనక్కరలేదు. మీలాగా నాకు నటించడం రాదు’ అని పవన్ కల్యాణ్ తీరును మంత్రి బొత్స దుయ్యబట్టారు.
నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!
అంతటితో ఆగని ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని అరికట్టడానికి తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. అయితే తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడుగుతారన్న భయంతోనే చంద్రబాబు రివర్స్ టెండరింగ్‌పై గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో మరింత స్పష్టత కావాలంటే చంద్రబాబు ఇంటికి వెళ్లి అడగాలని మీడియాకు సూచించారు. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే తాను 30 సంవత్పరాల ఇండస్ట్రీ అనీ, ఆయన కంటే పదేళ్లు తక్కువేనని వ్యాఖ్యానించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా మంత్రి అభయమిచ్చారు.