రేట్లు నచ్చకపోతే వాయిదా వేసుకోండి, ట్రోలింగ్‌లకు భయపడం: పవన్ అభిమానులపై బొత్స ఆగ్రహం
- IndiaGlitz, [Friday,February 25 2022]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతినివ్వకపోవడం.. గట్టి నిఘా పెట్టడంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఏపీ సర్కార్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు.
సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం చర్చిస్తోందని.. అంత ఆత్రుత ఉంటే ‘భీమ్లానాయక్’ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా అంటూ మంత్రి చురకలు వేశారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప.. వ్యక్తుల కోసం కాదని బొత్స స్పష్టం చేశారు. ప్రజల కోసం ఆలోచన చేయాలని.. సినిమా టికెట్ల విషయంలో ఒక కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ అంశం ఇంకా నడుస్తోందన్న ఆయన.. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి.. ముఖ్యమంత్రిని కలిసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం టికెట్ల ధరలు నచ్చకపోయినా.. గిట్టుబాటు కాకపోయినా సినిమా విడుదలలు వాయిదా వేసుకోవాలని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లకు ప్రభుత్వం భయపడదు అని బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.