కొన్ని పత్రికల కథనాలపై ఏపీ ఐపీఎస్ పోలీసుల సంఘం సీరియస్
- IndiaGlitz, [Saturday,April 06 2024]
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైనాట్ 175 అంటూ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. మేమంతా సిద్ధం సభల ద్వారా మరోసారి తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజాగళం సభలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెతిపోసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఈ మాటలు హద్దులు దాటుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం మర్చిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఇరు పార్టీలు ఫిర్యాదు చేసుకుంటున్నాయి.
ఇదే క్రమంలో కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అధికార వైసీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదుచేశాయి. దీంతో ఆరుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. అయితే ఎన్నికల సంఘం కొత్తగా నియమించిన వారిపై కూడా కొన్నిపత్రికలలో వివాదాస్పద కథనాలు ప్రచురితమయ్యారు. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు పోలీసులపై ప్రచురితమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఏపీ ఐపీఎస్ పోలీసుల సంఘం సీరియస్‌గా స్పందించింది.
ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న అధికారుల పట్ల అసత్య కథనాలు ప్రచురించడం సబబు కాదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు పనిగట్టుకుని పోలీసులపై విషపూరిత ప్రచారాలు చేస్తున్నాయని మండిపడింది. పగలనక,రాత్రనక, కుటుంబాలకుదూరంగా ఉండి ఎన్నో ఒత్తిడుల మధ్య విధులు నిర్వహిస్తుంటామని పేర్కొంది. ఇక మీద సరైన ఆధారాలు లేకుండా, కథనాలు లేదా వ్యాఖ్యాలు చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రాజకీయ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. త్వరలోనే ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ కథనాలపై చర్యలు తీసుకునేలా ఫిర్యాదుచేస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది.