AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. మరోసారి బాలికలదే, కృష్ణా జిల్లా టాప్

  • IndiaGlitz, [Wednesday,April 26 2023]

విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో పాటు ఒకేషనల్ విద్యార్ధుల ఫలితాలను ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఫస్టియర్‌లో 61 శాతం, సెకండియర్‌లో 72 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. ఫస్ట్ , సెకండియర్ రెండింటిలోనూ బాలికలే పైచేయి సాధించినట్లు బొత్స వెల్లడించారు. ఫస్టియర్‌లో 65 శాతం మంది బాలికలు , 58 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌లో 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స చెప్పారు. ఫస్టియర్‌లో 2,66,326 మంది .. సెకండియర్‌లో 2,72,001 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్, సెకండియర్‌ రెండింట్లోనూ కృష్ణా జిల్లా ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు:

ఈ నెల 27 నుంచి మే 6 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. మే 6 నుంచి జూన్ 9 వరకు ప్రాక్టీకల్స్ జరుగుతాయన్నారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని సూచించారు. ఇదే సమయంలో మంత్రి సొంత జిల్లా విజయనగరంలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇకపోతే.. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 10,03,990 మంది విద్యార్ధులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 4.84 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్.. 5.19 లక్షల మంది విద్యార్ధులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం విద్యార్ధుల్లో 9,20,552 మంది రెగ్యులర్.. 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు వున్నారు.