ap inter results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. కృష్ణా ఫస్ట్, కడప లాస్ట్
- IndiaGlitz, [Wednesday,June 22 2022]
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విజయవాడలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఫస్టియర్‌లో 54 శాతం.. సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత :
రాష్ట్రంలో మొత్తం ఇంటర్ విద్యార్ధుల సంఖ్య 9,41,358 కాగా.. 8,69,058 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,45,358 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 2,41,599 మంది పాసవ్వగా.. 54% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 4,23,455 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 2,58,449 మంది పాసవ్వగా.. 61% ఉత్తీర్ణత నమోదైంది.
కృష్ణా ఫస్ట్.. కడప లాస్ట్:
ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది పాసయ్యారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. ఆగస్ట్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సత్యనారాయణ తెలిపారు.