AP Inter Results:ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

  • IndiaGlitz, [Friday,April 12 2024]

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో గంటలకు బోర్డు కార్యదర్శి సౌరవ్ గౌరవ్ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు bie.ap.gov.in, bieap.apcfss.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫస్టియర్‌ విభాగంలో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక రెండో సంవత్సర ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలవగా.. 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం.