చంద్రబాబుకు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన హోం మంత్రి సుచరిత!
- IndiaGlitz, [Monday,June 10 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరం పరాజయం పాలైన టీడీపీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండగా.. గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసి మరీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మేకతోటి సుచరిత.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు..!
దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు నాయుడు దళితుల్ని తక్కువ చేసి మాట్లాడితే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం దళిత మహిళనైన నాకు అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించి గౌరవించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టిన కులం మాదని.. అలాంటి మా కులం మీద చంద్రబాబు చిన్న చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడారు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెప్పారు అని సుచరిత చెప్పుకొచ్చారు. కాగా గతంలో ఎస్సీగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా!
సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. నా నియోజక వర్గంలోని తాగు, సాగు నీటి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను. జగన్ అన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు అని హోంశాఖ మంత్రి పేర్కొన్నారు.