టాలీవుడ్‌కు ఊరట.. జగన్ సర్కార్‌కు షాక్, సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ గతంలో ఇచ్చిన జీవో నెం.35ను న్యాయస్థానం మంగళవారం సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సవాల్ చేస్తూ రాష్ట్రంలోని థియేటర్ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు స్పష్టం చేశారు. దీనిపై ఈరోజు ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. టికెట్ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందవర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరి కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.
మరోవైపు రాష్ట్రంలోని థియేటర్లలో బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించేందుకు వీలుగా ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments