ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

  • IndiaGlitz, [Tuesday,April 06 2021]

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎస్‌ఈసీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వెంటనే ఎన్నికల ప్రక్రియను సైతం ప్రారంభించారనే అభ్యంతరాలను టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కోర్టు ముందుంచాయి.

ఈ పిటషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం, ఎస్ఈసీ తరుఫు న్యాయవాది స్పందిస్తూ సుప్రీంకోర్టు నాలుగు వారాలని స్పష్టంగా చెప్పలేదని కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలను విన్న హైకోర్టు పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదనంతర చర్యలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. నిజానికి ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగి.. 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.